తెలంగాణలో హుజురాబాద్‌ నియోజకవర్గం ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఏకైక ఉపఎన్నిక కూడా హుజురాబాద్‌ కావడంతో.. ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ఈటల రాజేందర్‌ రాజీనామా తర్వాత నుంచి హుజురాబాద్‌లో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ఆయన రాజీనామాతో హుజురాబాద్‌ ఉపఎన్నిక అనివార్యంగా మారింది. గత ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ తరపునే గెలిచినప్పటికీ.. ఆ పార్టీకి ఆయన రాజీనామా తర్వాత బీజేపీలో చేరారు. అయితే హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌కు మంచి పట్టు ఉంది. ఇక్కడ పార్టీ కన్నా వ్యక్తే బలంగా మారడంతో.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ గెలుపు కోసం పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈటల కంచుకోటను ఎలాగైనా బద్దలు కొట్టాలని అధికార టీఆర్ఎస్‌ పార్టీ గత ఐదు నెలల కాలంగా హుజురాబాద్‌ నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తోంది. ఆ పార్టీ ముఖ్య నాయకులను హుజురాబాద్‌ నియోజకవర్గంలోని మండలాలకు ఇన్‌ఛార్జిలుగా నియమించి.. ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇలా ప్రధాన పార్టీలన్నీ హుజురాబాద్‌ ఉపపోరును సవాలుగా తీసుకున్నాయి. దీంతో విజయం ఎవరిని వరిస్తుందో అనే దానిపై అందరిలోనూ ఆతృత కనిపిస్తోంది. ఇక దేశంలోనే ఎక్కువ ఖర్చు చేస్తున్న ఉపఎన్నిక కూడా హుజురాబాదేనన్న టాక్‌ వినిపిస్తోంది. ఇందులో భాగంగా పలు రికార్డ్స్‌ సైతం నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు పారామిలటరీ బలగాల విషయంలోనూ  హుజురాబాద్‌ మరో రికార్డును బ్రేక్‌ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

హుజూరాబాద్ నియోజకవర్గం ఉపఎన్నికను సజావుగా నిర్వహించేందుకు పారా మిలటరీ బలగాలను భారీగా మోహరించారు. సాధారణ ఎన్నికల సమయంలో కన్నా ఎక్కువగా ఇప్పుడు బలగాలను  మోహరించడం చర్చనీయాంశం అయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చరిత్రలోనే ఇంత భారీగా బలగాలను మోహరించడం ఇదే ప్రథమం కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మొత్తం 17 కంపెనీల పారా మిలటరీ బలగాలను మాత్రమే మోహరించారు. కానీ ఇప్పుడు హుజురాబాద్‌ ఉపపోరు కోసం ఒకేసారి 20 కంపెనీల బలగాలను కేంద్ర ఎన్నికల సంఘం మోహరించడం గమనార్హం. ఇది ఒక రకంగా రికార్డేనని జిల్లా పోలీస్‌, ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: