ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచి ఇరవై ఏళ్లు దాటేసింది. ఇంకా చెప్పాలంటే 22 ఏళ్లు అవుతోంది. ఇప్ప‌ట‌కీ అక్క‌డ టీడీపీ బ‌లంగా లేదు. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తుంద‌న్న గ్యారెంటీ లేదు. అక్క‌డ వైఎస్ ఫ్యామిలీ ప్ర‌భావం ఎక్కువుగా ఉండడంతో టీడీపీ పోటీ ఇచ్చే అభ్య‌ర్థిని కూడా వెతికి ప‌ట్టుకో లేక‌పోతోంది. అలాంటి దీన స్థితి ఉన్న నియోజ‌క‌వ‌ర్గం లో ఇప్పుడు చంద్ర‌బాబు మ‌రో కొత్త ప్ర‌యోగం చేస్తున్నారు. ఆ నియోజ‌క‌వ‌ర్గం ఏదో కాదు ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప లోని జ‌మ్మ‌ల మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం.

ఫ్యాక్ష‌న్ ప్ర‌భావితంగా ఉన్న ఈ జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి పొన్నపురెడ్డి, దేవగుడి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు  ఉంది. అయితే ఎప్పుడూ కూడా ఈ రెండు కుటుంబాలు వేర్వేరు పార్టీల్లో ఉండి పోటీ చేస్తున్నాయి. ఇక పొన్న‌పురెడ్డి కుటుంబం ఇక్క‌డ వ‌రుసగా ఐదు సార్లు గెలిచింది. అలాంటిది ఈ కుటుంబానికి 1999 నుంచి గెలుపు అనేది లేదు. 1999 నుంచి 2014 వ‌ర‌కు దేవ‌గుడి కుటుంబం వ‌రుస విజ‌యాలు సాధించింది. అలాంటిది ఈ రెండు కుటుంబాలు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరిపోయాయి. టీడీపీ నుంచే ఒక‌రు ఎంపీ గా .. మ‌రొక‌రు ఎమ్మెల్యే గా పోటీ చేసినా కూడా ఇద్ద‌రూ ఓడిపోయారు.

అయితే ఎన్నిక‌ల త‌ర్వాత మ‌ళ్లీ ఈ రెండు కుటుంబాల నుంచి పోటీ చేసిన నేత‌లు పార్టీలు మారిపోయారు. ఇదే టైంలో దేవగుడి కుటుంబంలో రాజకీయంగా చీలికలు వచ్చాయి. దేవ‌గుడి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరితే... ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి టీడీపీ గూటికి చేరిపోయారు. ఇక చంద్ర‌బాబు ఇప్పుడు నారాయణరెడ్డి కుమారుడు భూపేశ్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్ ప‌ద‌వి క‌ట్ట బెడ‌తారని అంటున్నారు. అప్పుడు బీజేపీ నుంచి ఆదినారాయ‌ణ పోటీ చేస్తే మ‌ళ్లీ ఇక్క‌డ వైసీపీ ఈజీ గా విన్ అవుతుంది. ఏదేమైనా బాబు ఇక్క‌డ మ‌రో విఫ‌ల ప్ర‌యోగానికి తెర‌లేపిన‌ట్టే అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: