హుజురాబాద్‌ ఉపఎన్నిక ప్రచారపర్వం బుధవారంతో ముగియనుంది. ప్రచారానికి ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. బుధవారం రాత్రి ఏడు గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. చివరి రోజున ఉధృతంగా ప్రచారం నిర్వహించడంపై ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఇన్ని రోజులు టీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ ప్రచారాలతో హోరెత్తించగా.. ప్రచారం చివరి అంకంలో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంది. బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్, విజ‌య‌శాంతి వంటి కీల‌క నేత‌లంతా హుజురాబాద్‌లోని వివిధ గ్రామాల్లో ప్రచారం చేశారు. తమ మాట‌ల తూటాల‌తో జ‌నం దృష్టిని ఆక‌ర్షించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈటల రాజేందర్‌ ఓ వైపు టీఆర్ఎస్‌పై విరుచుకుప‌డుతూనే.. మరోవైపు హుజురాబాద్‌ అభివృద్ధికి తాను చేసిన కృషిని ప్రచారంలో ముఖ్య అస్త్రంగా ఈటల రాజేంద‌ర్ వాడుకున్నారు. మరీ ముఖ్యంగా మంత్రి హరీశ్‌ రావుపై ఈటల ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

టీఆర్ఎస్ నేత‌లు కూడా జెట్ స్పీడ్ ప్రచారం చేశారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలో మండ‌లానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇన్‌చార్జిలుగా ఉన్నారు. గ‌డిచిన ఐదు నెల‌ల కాలంలో సీఎం కేసీఆర్ స‌హా 14 మంది మంత్రులు హుజురాబాద్ వ‌చ్చి వివిధ కార్యక్రమాలు చేప‌ట్టి వెళ్లారు. మంత్రులు హ‌రీష్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్‌, కొప్పుల ఈశ్వ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం దాటి వెళ్లలేదు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద‌ర్‌ను విమ‌ర్శిస్తూనే.. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల‌ను జ‌నంలోకి తీసుకెళ్లారు. అలాగే ద‌ళిత బంధు, గొర్రెల పంపిణీ, కుల సంఘాల భ‌వ‌నాలతో ఓట‌ర్ల దృష్టిని త‌మ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు.  

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చివ‌రి రోజుల్లో బాగా పుంజుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స‌భ‌లు, స‌మావేశాల‌తో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఆ పార్టీ అభ్యర్ధి బ‌ల్మూర్ వెంక‌ట్ స్థానికుడు కాద‌న్న విమ‌ర్శలను ఆ పార్టీ నేత‌లు తిప్పి కొట్టారు. స్థానికత గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుకి లేవంటూ.. వారికి రేవంత్‌రెడ్డి ఇచ్చిన కౌంటర్‌ ఎటాక్‌ హైలైట్‌ అయ్యింది. టీఆర్ఎస్, బీజేపీని రెండూ ఒక్కటేనన్న నినాదంతో జ‌నంలోకి వెళ్లారు రేవంత్‌రెడ్డి.

ఇదిలావుంటే, హుజురాబాద్ ఉప ఎన్నిక‌ ప్రచారం ఈనెల 27 బుధవారంతో ముగిసిన తర్వాత ౩౦న జరిగే పోలింగ్‌కు రెండు రోజుల గ్యాప్‌ ఉంది. సాధారణంగా ప్రచారం తర్వాత పోలింగ్‌కు ఒకరోజు మాత్రమే విరామం ఉంటుంది. కానీ హుజురాబాద్‌ ఉపఎన్నికలో ప్రచారం ముగిసిన రోజుకి, పోలింగ్‌ రోజుకి మధ్య రెండు రోజులు గ్యాప్‌ ఉండటంతో.. ప్రలోభాలకు ఎక్కువ అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. దీంతో 28, 29 తేదీలు కీలకం కానున్నాయని, ఈ రెండు రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందోనన్న ఆందోళన ప్రధాన పార్టీల్లో నెలకొంది. దీంతో 28, 29 తేదీల్లో పారా హుషార్‌ అంటూ ఆయా పార్టీల అధిష్టానం నుంచి హుజురాబాద్‌లోని స్థానిక నేతలకు సూచనలు, ఆదేశాలు అందినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: