వరుసగా వస్తున్న తుపానులు, వరదలతో ఆంధ్రప్రదేశ్ వణికిపోతోంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు ఆరు సార్లు తుఫానులు వచ్చాయి. ప్రతి ఏడాది 3 నుంచి 4సార్లు భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగుల్చుతున్నాయి. దేశంలో ప్రకృతి వైపరీత్యాల ముప్పు ఎక్కువగా ఉన్న మూడు రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ అధ్యయనం వెల్లడించింది. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులే ఇందుకు కారణమని తెలిపింది.

కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలను.. వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు 28మంది మృత్యువాతపడ్డారు. 17మంది గల్లంతయ్యారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,316 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. 6.33లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాడి పశువులు, కాడెద్దులు, దూడలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాయి. 4జిల్లాల పరిధిలో1,533కిలోమీటర్ల మేర రహదారులకు నష్టం వాటిల్లింది.

భారీ వర్షాలతో తిరుపతి రామచంద్రాపురంలోని రాయల చెరువుకట్టకు గండిపడింది. దీంతో వరదనీరు లీకవుతోంది. ఏ క్షణమైనా కట్టతెగే ప్రమాదముండటంతో.. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు సమీప ప్రజలు పరుగులు తీస్తున్నారు. చెరువు తెగితే సుమారు 100పల్లెలకు ముంపు పొంచి ఉంది.

ఇక నెల్లూరు జిల్లాలో పెన్నానదిపై ఉన్న సోమశిల జలాశయానికి వరద ఉధృతి కాస్త తగ్గింది. ప్రస్తుతం 1.79లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పై నుంచి వస్తున్న ప్రవాహంతో నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీ, పుట్టపాలెం, శాంతినగర్, తదితర కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి.

ఇప్పటికే కుండపోత వర్షాలతో కుదేలైన రాష్ట్రానికి మరోసారి భారీ వర్షాల గండం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 26నుంచి డిసెంబర్ 2వరకు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు పడే అవకాశముందంటున్నారు.







 







మరింత సమాచారం తెలుసుకోండి: