ఊహించని విధంగా మూడు రాజధానుల బిల్లుని జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే మళ్ళీ సమగ్రమైన బిల్లుని రూపొందించుకుని ముందుకొస్తామని జగన్ ప్రభుత్వం చెప్పింది. మరి తర్వాత ఎలాంటి బిల్లుతో ముందుకొస్తుంది? మూడు రాజధానులని కొనసాగిస్తారా? లేక ఒకే రాజధానితో ముందుకొస్తారా? అనేది మాత్రం క్లారిటీ లేదు. సరే అప్పుడు ఏ బిల్లుతో ముందుకొస్తారనే విషయం పక్కనబెడితే..అసలు ఇప్పుడు జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుపై వెనక్కి తగ్గడానికి కారణాలు ఏంటి అనే దానిపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి.

ఒక వైపు రెండేళ్ల నుంచి అమరావతి రైతులు, ప్రజలు....ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మూడు రాజధానుల అంశం కోర్టులో ఉంది. ఇక తాజాగా కోర్టులో కూడా మూడు రాజధానుల బిల్లుని కొట్టేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుందని ప్రచారం నడుస్తోంది. అదే సమయంలో మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకోమని కేంద్రంలోని పెద్దలు జగన్ ప్రభుత్వాన్ని సూచించారని, అందుకే జగన్ వెనక్కి తగ్గారని ప్రచారం కూడా ఉంది.


ఇక కొందరు బీజేపీ నేతలు..తమ వల్లే జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని హడావిడి చేస్తున్నారు. ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా...తిరుపతికి వచ్చిన విషయం తెలిసిందే. తిరుపతికి వచ్చిన సందర్భంలో అమిత్ షా...ఏపీ బీజేపీ నేతలకు క్లాస్ పీకి...అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్ధతు ఇవ్వాలని చెప్పారట.

ఈ క్రమంలోనే తాజాగా ఏపీ బీజేపీ నేతలు..పాదయాత్ర చేస్తున్న రైతులు, మహిళలకు మద్ధతు ఇచ్చారు. అలాగే అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇక బీజేపీ నేతలు రైతులని కలిసిన మరుసటి రోజు జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంపై వెనక్కి తగ్గింది. దీంతో ఇది తమ వల్లే జరిగిందని, తాము అమరావతికి మద్ధతు తెలపడంతోనే మూడు రాజధానులపై వెనక్కి తగ్గారని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ దీనికి అసలు కారణం ఏంటో వైసీపీకే తెలియాలి. అయితే ఈ విషయంపై బీజేపీ ఎక్కువ ఊహించికుంటున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp