ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రకృతి పగబట్టినట్లుగా కనిపిస్తోంది. దాదాపు పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీ ప్రజలు తడిసి ముద్దయ్యారు. ఇక గతంలో ఎన్నడూ లేనట్లుగా తిరుపతి పట్టణంలో ఏకంగా 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో తిరుమలకు వెళ్లే అన్ని మార్గాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రెండు రోజుల పాటు మూసివేశారు. రెండు ఘాట్ రోడ్లు, అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్టు నడక మార్గాలు కూడా వర్షాలకు ధ్వంసమయ్యాయి. ఇక రాయలసీమ ప్రాంతం అయితే చిగురుటాకులా వణుకుతోంది. కడప జిల్లాలోని 5 మండలాల ప్రజలు వరద నీటిలో కాలం గడుపుతున్నారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. భారీ వరదలకు పలు చోట్ల రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. బ్రిడ్జిలు కూడా కూలిపోయాయి. ఎన్నో చెరువులకు గండ్లు పడ్డాయి. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వేల ఎకరాల్లో పంట నీటిపాలైంది. ఇప్పటి వరకు సుమారు 30 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం చెబుతోంది. అలాగే ఏకంగా 3 వేల కోట్ల రూపాయల వరకు నష్టం జరిగినట్లు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు.

పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. ఈ లోపే మరో పిడుగు లాంటి వార్తను వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తమిళనాడు వద్ద బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం.... పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు వెల్లడించారు. దీని ప్రభావంతో ఈ నెల 27వ తేదీ నుంచి నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో అనంతపురం, గుంటూరు, కృష్ణా  జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో నాలుగు జిల్లాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రికార్డు వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: