చంద్రబాబు ఏడ్చిన సన్నివేశం ఇంకా ఏపీ పొలిటికల్ సీన్ పై అట్లాగే కనపడుతోంది. అయితే దాని ప్రభావం ఎవరిపై ఎలా ఉంది, ఎంత ఉందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. చంద్రబాబు ఎపిసోడ్ తర్వాత వెంటనే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రంగంలోకి దిగి ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత చాలామంది ఆయన్ను పరామర్శించారు, మద్దతుగా మాట్లాడారు, ప్రెస్ నోట్లు విడుదల చేశారు. కానీ ఇప్పుడు పరిణామాలు మరో టర్న్ తీసుకున్నాయి. ముద్రగడ లేఖ మరింత వివాదాస్పదం అవుతోంది.

చంద్రబాబు సతీమణిని తాము ఏమీ అనలేదని, ఆయనే ఏదేదో ఊహించుకుని తమపై నిందలేస్తున్నారని వైసీపీ నేతలంటున్నారు. ఆ క్రమంలోనే ఎమ్మెల్యే రోజా.. తనని ఇబ్బంది పెట్టిన పాపం ఊరికే పోదంటో మరోసారి శాపనార్థాలు పెట్టారు. ఇక లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ కంటే చంద్రబాబే పెద్ద నటుడని తేల్చి చెప్పారు. ఆ మాట తాను అనడంలేదని, స్వర్గీయ ఎన్టీఆరే స్వయంగా అన్నారని గుర్తు చేశారు లక్ష్మీపార్వతి. ఇప్పుడు ఫైనల్ గా ముద్రగడ పద్మనాభం లేఖ చంద్రబాబు సింపతీ కోణాన్ని పూర్తిగా మార్చేసింది. కాపు రిజర్వేషన్లకోసం ఉద్యమం చేసినందుకు, తనని, తన కుటుంబాన్ని చంద్రబాబు తీవ్రంగా అవమానించారని, శారీరకంగా, మానసికంగా వేధించారని ఆరోపిస్తూ లేఖ విడుదల చేశారు ముద్రగడ పద్మనాభం. ముద్రగడ వైసీపీ సానుభూతి పరుడు అని పూర్తిగా ముద్రవేయలేం కానీ.. ఆయనకి కాపు సామాజిక వర్గంలో క్లీన్ ఇమేజ్ ఉంది. ఓవైపు అదే సామాజిక వర్గం నుంచి పవన్ కల్యాణ్, చంద్రబాబుని సమర్థిస్తే.. ముద్రగడ మాత్రమ బాబుపై పెద్ద పెద్ద నిందలేశారు.

చంద్రబాబు ఏడ్చిన సంఘటన తర్వాత ఒకటి రెండు రోజులు కేవలం సింపతీ కోణం మాత్రమే బయటకొచ్చింది. వైసీపీ ఆరోపణలు ఎప్పుడూ సహజమేకదా అని అనుకున్నారంతా. కానీ రోజులు గడిచే కొద్దీ ముద్రగడలాంటి తటస్థులు సైతం ఇలా చంద్రబాబుపై విమర్శలు చేస్తుంటే ఆ ఎపిసోడ్ మరో మలుపు తిరిగిందని చెప్పక తప్పదు. చంద్రబాబుకోసం ఎన్టీఆర్ కుటుంబం అంతా తిరిగి ఒక్కటైంది అనుకుంటున్న వేళ.. ఇలా బయటనుంచి విమర్శల డోసు పెరగడం టీడీపీలో ఆందోళనకు కారణం అవుతోంది. ముద్రగడ తర్వాత ఇంకెంతమంది నోళ్లు విప్పుతారో, చంద్రబాబు వల్ల తామెంతగా బాధపడ్డామని చెబుతారో.. అనే అనుమానాలున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే.. ఇకపై చంద్రబాబు సింపతీ కోణం మాయమైపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: