ఏపీలో వరద బీభత్సం కారణంగా చాలామంది ఇళ్లలోకి వరద నీరు చేరి అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా చిత్తూరు,కడప, నెల్లూరు జిల్లాల్లో ఈ వరద తాకిడి ఎక్కువగా ఉంది. దీంతో వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది ఇళ్లలోకి నీరు వచ్చిన కుటుంబాలకు రెండు వేల రూపాయల నగదును అందజేస్తున్నారు. రాత్రి, పగలూ తేడా లేకుండా పరిహారాన్ని పంపిణీ చేసేస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం మొత్తాన్ని ఇందుకోసం రంగంలోకి దించారు. రెండు రోజుల్లో వరద పరిహారం మొత్తం పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతోజిల్లా కలెక్టర్లు, ఎమ్మార్వోలు, రెవెన్యూ సిబ్బంది పరిహారాన్ని పంచేందుకు వరద ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు.

వరదల కారణంగా నష్టపోయిన వారికి పరివారం వేగంగా అందించాలని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పరామర్శలు మొదలుపెట్టారు. నిన్నతిరుపతిలో పర్యటించి, వరద బాధితులకు ఓదార్చారు. వరదల కారణంగా మృతి చెందిన వారికి కోటిరూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో వైపు జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద బాధితులకు నిత్యావసరాలు, దుప్పట్లను పంపిణీ చేశారు. ప్రతిపక్ష నేతలు వరదలపై విమర్శలు మొదలు పెట్టకముందే పరిహారాన్ని పంచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  ప్రతిపక్ష నేతలు పరామర్శకు వచ్చేలోపే బాధితుల చేతిలో నగదు ఉండాలని రెవెన్యూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది.  

ఏపీలో వరద పరిహారం అందించేందుకు ప్రభుత్వం కేవలం 2 రోజుల టార్గెట్ మాత్రమే పెట్టుకుంది. ఆలోగా పూర్తి సాయం అందించాలని ఆదేశించింది. ఇప్పటికే వరద కారణంగా నష్టపోయిన జిల్లాల్లో 90శాతం ప్రజలకు పరిహారం అందజేసింది. మరో వైపున వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు కూడా అందించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పౌరసరపరాల శాఖ ఇందుకోసం హడావిడి పడుతోంది. మరోవైపు వరద పోటెత్తిన ప్రాంతాల్లో సహాయక చర్యలతో పాటూ.. శానిటేషన్ కూడా మెరుగు పరచాలని ఆదేశాలు అందాయి. దీంతో మునిసిపల్ సిబ్బంది కూడా రాత్రి పగలూ తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: