మేం మ‌ట్టిని తింటాం
మాకు అన్నం దొర‌క‌దు

మాకు నీళ్లు వ‌ద్దు
ఉన్న నీళ్ల‌న్నీ ప్రాణాంత‌కాలే!

మాకు ఊరు వ‌ద్దు
ఊరూ చెరువు క‌ట్ట అన్న‌వి య‌మ పాశాలు
అవును మాకు ఏమీ వ‌ద్దు
వ‌ద్దు అని చెప్ప‌డం లో అర్థం ఉంది  
అనంతార్థం ఉంది.. వ‌ద్దు అని చెప్ప‌డంలో
మా ద‌య‌నీయ‌త ఉంది.. అధికారులూ ఇటు రాకండి
మీ లెక్క తేలుస్తాం.. హీరోలూ ఇటు రాకండి
మీ కాల్మొక్కుత్తాం కానీ ఇటు రాకండి ప్లీజ్ ప్లీజ్

శ‌వాల‌ను దాటుకుని మేం ఉన్నాం
శ‌వాల మోత‌కు అయినా మీరు వ‌స్తారా?
ఇదీ ఇవాళ్టి సీమ క‌ష్టం.. వ‌ర‌ద‌లొచ్చి ఊళ్ల‌కు ఊళ్లు నాశ‌నం అయిపోతుంటే  నోరులేని జీవాలు నోరున్న మ‌నుషులు ఇలా ఒక్క‌రేంటి అంతా నానా యాత‌న ప‌డుతుంటే ఇవేవీ ప‌ట్ట‌ని టాలీవుడ్ పెద్దోళ్లు కొత్త సినిమా తేదీల కోసం వెతుకులాడుతున్నారు.
ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడు ఆచార్య ఎప్పుడు అన్న తేదీల వెతుకులాట‌లోనే సినిమా ఇండ‌స్ట్రీ ఉంటుందే త‌ప్ప ఎవ్వ‌రికీ ప్ర‌జ‌ల క‌ష్టాలు కానీ బాధ్య‌త‌లు కానీ ప‌ట్ట‌డం లేదు. ఇలాంటి సంద‌ర్భంలో ఆదుకోవాల్సిన సినిమా పెద్ద‌లు ఎక్క‌డున్నారో అర్థ‌మే కావ‌డం లేదు.

వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇప్ప‌టికీ నీట మునిగిన ప‌ల్లెల‌కు చుట్టూ నీరు ఉన్నా తాగేందుకు గుక్కెడు నీరు లేదు. సాయం అంటూ అడిగినా ప‌ట్టించుకున్న నాథుడే లేడు. రాజ‌కీయ పార్టీలూ వాటి గోల స‌రే క‌నీసం సినిమాల పేరిట సందేశాలు ఇచ్చే క‌థానాయ‌కులు వారి నిర్మాతలు అయినా ముందుకు రావాలి క‌దా! కానీ ఇవేవీ ప‌ట్ట‌కుండా ఎవ‌రికి వారే అన్న విధంగా ఉన్నారు ఇవాళ‌.. మృతుల కుటుంబాల‌ను ఆదుకోవాలి అన్న క‌నీస ఆలోచ‌న లేకుండా ఉన్నారు. బాధితుల‌కు ప‌ట్టెడ‌న్నం పెట్టి మాన‌వ‌త‌ను చాటుకోవాల‌న్న స్పృహ కూడా లేదు. ఏమంటే మేమే క‌రోనా కార‌ణంగా డ‌బ్బులు పోగొట్టుకుని ఉన్నాం అలాంటిది ఇలాంటి స‌మ‌యంలో ఎలాంటి సాయం చేయాలో మీర‌యినా చెప్పండి.. అని ఎదురు ప్ర‌శ్నిస్తారు. ఉన్నంత‌లో సాయం చేయండి ఉన్న‌దంతా ఊడ్చి సాయం చేయ‌మ‌ని ఎవ్వ‌రూ అన‌రు కానీ ఇవాళ సీమ  ప‌ల్లెలు తిండి లేక అల్లాడిపోతున్నాయి. క‌నుక వారికో భ‌రోసా ఇవ్వండి. ఇళ్లు కూలి వ‌ర‌ద ఉద్ధృతి త‌గ్గ‌క చంటి పిల్ల‌ల‌తో త‌ల్లులు క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. వారిని ఆదుకోండి. అది  మీ బాధ్య‌త మ‌రిచిపోతాం అంటే ఒప్పుకోం.




మరింత సమాచారం తెలుసుకోండి: