ట్రాఫిక్ నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన వారిపై పోలీసులు ఈ-చ‌లాన్‌ల‌తో హ‌డ‌ల్ ఎత్తిస్తున్నారు.   ప్ర‌భుత్వ వాహ‌నాలు సైతం నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఈ -చ‌లాన్‌లు వేసుకుంటున్నాయి. ఇలాంటి ఘ‌ట‌నే కామారెడ్డి కలెక్టర్ వాహనం టీఎస్16 ఈఈ3366 పై  భారీ మొత్తంలో ఈ చలాన్‌లు ఉన్నాయి.
 2016 నుంచి 2021 ఆగస్టు 20 వరకు 28 చలానాలు వేసారు. మొత్తం రూ. 27,580 జరిమానా విధించారు అధికారులు. ఇందులో 24 అతివేగంగా వాహనం నడపడం ద్వారా ప‌డ‌టం గమనార్హం.

ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన అధికారులే నిబంధనలు పాటించకపోవ‌డంతో.. ఇక సామాన్య ప్రజలు ఎందుకు పాటిస్తారని ప‌లువురు పేర్కొంటున్నారు.  వాహనాల మీద ట్రాఫిక్ సిబ్బంది వేసే చలానాల విషయంలో తరచుగా ఇది కనబడుతూనే ఉంది. దేశాన్ని పాలించే నాయకుల నుంచి సామాన్యుల వరకు ట్రాఫిక్ తప్పకుండా పాటించాలంటూ పోలీసులు తరచూ చెబుతున్నా.. పెడచెవిన పెడుతున్నారు. దీనికి  సంబంధించిన నిదర్శనాలు అప్పుడప్పుడూ దర్శనమిస్తూనే ఉన్నాయి. అలా ఓ  జిల్లా కలెక్ట‌ర్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు. ఆయన వాహనం మీద ఏకంగా  28 చలానాలున్నాయి.

 కలెక్టర్లు ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఇది తొలిసారేమి కాదు.  అందులో కామారెడ్డి  జిల్లా కలెక్టర్ మొదటి వ్యక్తి కాదు. అంతకు ముందు జనగామ జిల్లా కలెక్టర్ మీద కూడా ఇలాంటి కేసు ఒక‌టి ఉంది. గత సెప్టెంబర్ లోనే ఇది బ‌య‌టికి వ‌చ్చింది. జనగామ కలెక్టర్ ప్రభుత్వ వాహనానికి రెండేండ్ల‌లో 2021, ఆగస్టు 30 వరకు దాదాపు 23 సార్లు జరిమానాలు పడ్డాయి. వీటిలో 22సార్లు ఓవర్ స్పీడ్ కాగా.. ఒకసారి ట్రాఫిక్ సిగ్న‌ల్ వ‌ద్ద జీబ్రా క్రాసింగ్ చేసినందుకు చలానాలు విధించారు పోలీసులు.  ఈ చలానాల విలువ మొత్తం రూ.22,100 కాగా.. యూర్ ఛార్జీలు రూ.805 కలపుకుని మొత్తం 22,905 రూపాయలు అయింది.

స‌గానికి పైగా హైద‌రాబాద్ రింగ్ రోడ్డు మీద ఓవర్ స్పీడ్ తో వెళ్లినందుకే విధించడం గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యం. అప్పట్లో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగిన విష‌యం విధిత‌మే. సాధార‌ణంగా ఒక్క చ‌లాన్ పెండింగ్ లో ఉన్నా వాహ‌నాన్ని సీజ్ చేస్తాం అని ప్ర‌క‌టించిన పోలీసులు ఇలా ప‌దుల సంఖ్య‌లో చలాన్‌ల‌ను పెండింగ్ లో ఉన్న క‌లెక్ట‌ర్ పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి.. అధికారుల వాహనాలపై కూడా తగిన చ‌ర్య‌లు, నియమ నింబంధనలు పాటించడంలో ప్రజలకు మార్గదర్శకంగా నిలవాలని ప‌లువురు నెటిజన్లు కోరుతున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: