తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిస్థితి ప్రస్తుతం కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తోంది. నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కేసీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు నాలుగు రోజులుగా హస్తినలో ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ పార్టీ అధినేతపై పీఎంవో కరుణించడం లేదు. ఆదివారం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌కు ఇప్పటి వరకు పీఎంవో నుంచి పిలుపు రాలేదు. రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేసీఆర్ పెట్టుకున్న దరఖాస్తును ప్రస్తుతానికి ప్రధాని కార్యాలయం అధికారులు ఇంకా పరిశీలిస్తూనే ఉన్నట్లున్నారు. అటు కేంద్ర మంత్రులు కూడా నాలుగు రోజులుగా కేసీఆర్‌ను కలవటం లేదు. నాలుగు రోజుల్లో కేవలం ఇద్దరంటే ఇద్దరు కేంద్ర మంత్రులు మాత్రమే కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పియూష్ గోయల్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ మాత్రమే తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చించారు. అంతే తప్ప... ఎవరినైతే కేసీఆర్ కలవాలి అని అనుకున్నారో... వారు మాత్రం కేసీఆర్‌ను ఇప్పటి వరకు కలవలేదు.

వాస్తవానికి ఈ సారి ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కో భేటీ అయ్యేందుకు కేసీఆర్ గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే నాలుగు రోజులు గడిచినప్పటికీ... ఇప్పటి వరకు వీరితో కేసీఆర్ సమావేశం కాలేదు. నాలుగు రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన కార్యాలయంలోనే ఉన్నారు. ఏ పర్యటన చేయలేదు. ఈ రోజు కేంద్ర మంత్రివర్గ సమావేశం కూడా జరుగుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణ, కొత్త వ్యవసాయ చట్టాల రద్దు, క్రిప్టో కరెన్సీ పై బిల్లు, వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు వంటి కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అన్ని శాఖల మంత్రులు, అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయినా సరే... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రం అపాయింట్‌మెంట్ ఇవ్వటం లేదు. అయినా తెలంగాణ మంత్రుల బృందం మాత్రం కేంద్ర పెద్దల సంప్రదింపుల కోసం ఎదురు చూస్తోంది. ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపేందుకే కేసీఆర్, మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లింది. అలాగే యాసంగి వరి పంట గురించి కూడా ప్రధానితో చర్చలు జరుపుతామని కేసీఆర్ వెల్లడించారు. కానీ పీఎంవో మాత్రం ఇప్పటి వరకు కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: