ఇన్నాళ్లు హైద‌రాబాద్ వ‌ర‌కే ఎక్కువ‌గా ప‌రిమితం అయిన ఎంఐఎం పార్టీ గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా దేశ రాజ‌కీయాల్లో త‌మ ప్ర‌భావం చూపించాల‌ని యోచిస్తున్నారు. అందులో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. వ‌చ్చే సంవత్సం జ‌ర‌గ‌బోయే యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల పై గురి పెట్టింది. ఆ పార్టీ అధ్య‌క్షుడు అస‌దుద్దీన్ ఓవైసీ ఇప్ప‌టికే యూపీలో ప‌ర్య‌టించారు. అయితే, 50 నుంచి 60 సీట్ల‌లో ఎంఐఎం త‌న అభ్య‌ర్థుల‌ను నిల‌బెడుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ ఇప్పుడు ఏకంగా 100కు పైగా సీట్ల కోసం బ‌రిలో దింప‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది.


  యూపీలో 400ల‌కు పైగా సీట్టు ఉండ‌డం.. ఇందులో 100కు పైగా సీట్ల కోసం ఎంఐఎం పోటీ చేయనుండ‌డం సంచ‌ల‌నం రేపుతోంది. ప‌తంగి పార్టీ పోరుతో ఎవ‌రు న‌ష్ట‌పోతారు.. ఎవ‌రు లాభం పొందుతారు అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి కూడా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌నే క‌సితో ఉంది. అలాగే ప్ర‌తిప‌క్షాలుగా ఉన్న కాంగ్రెస్‌, బీఎస్‌పీలతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోంది. మ‌జ్లీస్ ను దేశ వ్యాప్తంగా విస్తరించాల‌ని చూస్తున్న ఆ పార్టీ అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల బ‌రిలో దిగి స‌త్తా చాలాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.


యూపీలో ముస్లిం వ‌ర్గం  ప్రాభ‌ల్యం ఎక్కువ‌గా ఉన్న  ప్రాంతాలపై  గురి పెట్టారు. ఉత్త‌రప్ర‌దేశ్ లో 403 అసెంబ్లీలో  స్థానాలు ఉండగా.. దాదాపు వంద‌ స్థానాల్లో బ‌రిలోకి దిగ‌నున్న‌ట్టు మ‌జ్లీస్ పార్టీ నేత‌లు తాజాగా ప్ర‌క‌టించారు. యూపీలో ద‌ళితులు, ముస్లిం ఓట్ల‌నే ల‌క్ష్యంగా చేసుకుని వ్యూహాలు ర‌చిస్తోంది ఎంఐఎం. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో  40 శాతానికి పైగా ద‌ళితులు, ముస్లీం వ‌ర్గాలు ఉన్నాయి.  అయితే, మ‌జ్లీస్ పార్టీ ఒంట‌రిగా పోటీ చేస్తే ఎక్కువ‌గా న‌ష్ట‌పోయేది మాత్రం అఖిలేశ్ నేతృత్వంలోని స‌మాజ్‌వాదీ పార్టీనే.. ఎందుకంటే ఈ రెండు సామాజిక వ‌ర్గాల ఓట్లు ఇప్ప‌టివ‌ర‌కు ఎస్పీ వైపు ఉండ‌డ‌మే. ఎంఐఎం పోటీతో అంతిమంగా బీజేపీకి అనుకూలంగా మారే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి అస‌దుద్దీన్ ఓవైసీ పొత్తుకు సిద్దంగానే ఉన్నారు. చివ‌రి వ‌ర‌కు ఎలాంటి మార్పులు జ‌రుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: