తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇప్పటికే వరి సాగు దుమారం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పుడు వరుసగా దుబ్బాక, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమితో ఈ యుద్ధం మరింత ముదిరింది. ఉప ఎన్నిక ఓటమితో మరింత రగిలిపోతున్న కేసీఆర్... కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. యాసంగి పంటపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ... అధికార పార్టీ నేతలు, మంత్రులు అంతా కలిసి ధర్నా నిర్వహించారు కూడా. అయితే తొలి నుంచి కేసీఆర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. కావాలనే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఎదురు దాడి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేసీఆర్‌పై ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యారు. రైతుల పట్ల కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పంట కోసి కల్లాల్లో ఆరబోసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతుల ఉసురు తప్పకుండా తగులుతుందని ఈటల మండిపడ్డారు. ప్రస్తుత సీజన్‌లో ధాన్యం ఎంతైనా సరే.... కొనుగోలు చేయాలని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిందని గుర్తు చేశారు ఈటల. అయితే కేసీఆర్ మాత్రం వచ్చే సీజన్‌తో లింక్ పెట్టి ధాన్యం విషయంలో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు ముందు చూపు లేదన్నారు. అందుకే ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈటల. ప్రభుత్వం కొనకపోవడంతో... తక్కువ ధరకే ధాన్యాన్ని రైతులు అమ్ముకుంటున్నారన్నారు. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం గొప్పలు చెబుతోందని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు రైతుల వద్ద కనీసం ఒక్క గింజ ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని... ఇందుకు తక్షణమే కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈటల రాజేందర్.


మరింత సమాచారం తెలుసుకోండి: