పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజకీయాలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఢీ అంటే ఢీ అనేలా తలపడుతున్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీని ఓడించి అధికారం చేపడతామని బీజేపీ నేతలు శపథం కూడా చేశారు. అన్నట్లుగానే ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల కోసం దాదాపు ఏడాది ముందు నుంచే ప్లానింగ్ చేసింది బీజేపీ. టీఎంసీలో కీలక నేతలకు ముందుగానే గాలం వేసిన కమలం పార్టీ నేతలు.. వారిని తమ వైపు తిప్పుకున్నారు. టీఎంసీని దెబ్బ తీసేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను వాడేసింది బీజేపీ. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ మొదలు... కింది స్థాయి కార్యకర్తల వరకు కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. కాని చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విజయం దీదీనే వరించింది. హ్యాట్రిక్ విజయంతో మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు మమతా బెనర్జీ.

అధికారంలోకి వచ్చిన నాటి బీజేపీ ప్రత్యామ్నాయంగా పావులు కదుపుతున్న మమతా... థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తోంది. అయితే బెంగాల్‌లో మమతా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె నుంచి దూరంగా వెళ్లిపోయిన నేతలంతా తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో కీలక నేత కూడా మమతా బెనర్జీకి మద్దతు తెలిపారు. సంచలన వ్యాఖ్యలతో సంచలనాలకు కేంద్ర బిందువైన బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఇప్పుడు మమతాకు బాసటగా నిలిచారు. ఢిల్లీ పర్యటకు వచ్చిన మమతా... ముందుగా సుబ్రమణ్యస్వామితో భేటీ అయ్యారు. సరిగ్గా 24 గంటల ముందు బెంగాల్ గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్‌తో సుబ్రమణ్యస్వామి సమావేశమయ్యారు. మమతా మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసానికి స్వయంగా సుబ్రమణ్యస్వామి రావడం కూడా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలకంగా మారింది. ప్రధానితో భేటీకి ముందు సుబ్రమణ్యస్వామి స్వయంగా వచ్చి కలవడం... తాను మమతా వెంటే ఉన్నానని చెప్పడం మరింత కీలకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: