రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఏ చిన్న పని చేసినా... దానికి అడ్డు చెప్పడం ఏపీ పోలీసులకు అలవాటుగా మారినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత పట్ల పలుమార్లు అభ్యంతరకరంగా వ్యవహరించిన పోలీసులు... మరోసారి విమర్శలకు తెర లేపారు. గతేడాది విశాఖ పర్యటనకు వెళ్లిన చంద్రబాబును పోలీసులు ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. చివరికి ఈ వ్యవహారంపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఆ తర్వాత తిరుపతి ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చేందుకు కూడా పోలీసులు అనుమతించలేదు. దీంతో దాదాపు 8 గంటలకు పైగానే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో చంద్రబాబు బైఠాయించారు. చివరికి చిత్తూరు జిల్లా కలెక్టర్ వచ్చి పరిస్థితి వివరించడంతో చంద్రబాబు హైదరాబాద్ పయనమయ్యారు. ఆ తర్వాత కూడా పలు మార్లు టీడీపీ నేతల పట్ల పోలీసులు వ్యవహారించిన తీరు ఆరోపణలకు కారణమైంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కూడా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇప్పుడు తాజాగా వరద ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. వర్షాలు, వరదల కారణంగా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో భారీ నష్టం సంభవించింది. ఈ జిల్లాల్లో బాధితులను చంద్రబాబు పరామర్శిస్తున్నారు. నిన్న కడప జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత... రెండో రోజు చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాలను సందర్శించారు. ఇదే సమయంలో చిత్తూరు జిల్లా పోలీసులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. తిరుపతి సమీపంలోని రాయల చెరువు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. రాయల చెరువు కట్ట తెగేందుకు సిద్ధంగా ఉందని... దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. దీంతో రాయలచెరువును పరిశీలించేందుకు చంద్రబాబు వెళ్లారు. అయితే చెరువు పరిసరాల్లో ఎలాంటి పర్యటనలకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. అనుమతి లేకుండా పర్యటించినందుకు చంద్రబాబుకు నోటీసులు అందించారు. ప్రస్తుతం రాయల చెరువు రెడ్ జోన్‌లో ఉందన్నారు పోలీసులు. చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశీలిస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: