గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం ద్వారా ఏపీలో తిరుగులేని నేతగా వైఎస్ జగన్ అవతరరించారు.  గత అసెంబ్లీ ఎన్నికలే కాదు.. ఆ తర్వాత.. ఏపీలో ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీనే అలవోకగా విజయం సాధిస్తోంది. కొన్ని చోట్ల అసలు వైసీపీకి ఇతర పార్టీల నుంచి కనీస పోటీ లేదు. బద్వేలు వంటి చోట్ల ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పూర్తిగా చేతులెత్తేసింది. మొన్నటికి మొన్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో 54కు 54 డివిజన్లూ వైసీపీనే సొంతం చేసుకుంది. వీటికి పరాకాష్టగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీని సైతం వైసీపీ బంపర్ మెజార్టీతో దక్కించుకుంది.


ఈ విజయాలను బేరీజు వేస్తే ఇప్పట్లో వైసీపీని దెబ్బ కొట్టే రాజకీయ పార్టీ కనిపించడం లేదు. అయితే.. రోజులన్నీ ఎప్పుడూ ఒకలా ఉండవు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. ఒక ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకత రావాలంటే ఇది తక్కువ సమయమే. కానీ.. ఏమైనా జరగొచ్చు. అయితే.. జగన్ తన చేజేతులా చేసుకుంటే తప్ప.. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన గెలుపును ఎవరూ ఆపలేకపోవచ్చు. అయితే జగన్‌ కు కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం.


జగన్‌ను హీరోను చేసింది గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన చేసిన పాదయాత్రే. పల్లె పల్లెకూ నడిచి వెళ్తూ.. అక్కమ్మ.. చెల్లెమ్మ.. తాతా అంటూ ఆయన ఆప్యాయంగా ప్రజలను పలకరించారు. వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. అయితే.. జగన్ సీఎం అయిన తర్వాత మళ్లీ జనంలోకి అంతగా వెళ్లడం లేదు. సాధారణ సమయాల్లో యాత్రలు చేయకపోయినా పర్వాలేదు.. కానీ.. తనను గెలిపించిన జనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా జగన్ కదలకపోతే.. అది నాయకత్వం అనిపించుకోదు. అందుకే జగన్ జనంలోకి వెళ్లాలి.. ఒక సీఎంగా కాకపోయినా.. తనను గెలిపించిన ప్రజలకు భరోసా ఇచ్చే నాయకుడిగా జగన్ జనంలోకి వెళ్లాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: