పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూకుడు మీదున్నారు. హ్యాట్రిక్ విజయంతో... బెంగాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని ముచ్చటగా మూడోసారి అధిరోహించిన మమతా... అదే జోరుతో ముందుకు సాగుతున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కూడా దీదీ ప్లాన్ చేస్తున్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా తాము సిద్ధమవుతున్నట్లు ఇప్పటికే దీదీ ప్రకటించారు కూడా. ఇక బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ అగ్రనేతలతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగింది మమతా పోరాటం. చివరికి తమ పార్టీకి చెందిన కీలక నేతలను కమలం పార్టీ నేతలు లాగేసుకున్నా కూడా... దీదీ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. బీజేపీ అగ్రనేతల సవాల్‌ను స్వీకరించి... తన సొంత నియోజకవర్గం కాదని... నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత... అదే బీజేపీ నేతలను తమ వైపు తిప్పుకున్నారు మమతా. అదే జోరుతో బీజేపీ అగ్రనేతలతో కూడా సంప్రదింపులు జరిపారు దీదీ. బీజేపీ సీనియర్ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా మమతా వెంటే ఉంటా అంటూ ప్రకటించారు.

ఇప్పుడు తాజాగా ఈశాన్య భారతంలో సత్తా చాటేందుకు కూడా టీఎంసీ అధినేత్రి ప్లాన్ వేస్తున్నారు. ఇందులో భాగంగా మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. మేఘాలయాలో హస్తం పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ గూటికి చేరుకున్నారు. అలాగే కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా కూడా మమతాకు జై కొట్టారు. మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు ఉన్న మేఘాలయా అసెంబ్లీలో 21 మంది సభ్యులతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అయితే ఇప్పుటు మొత్తం 12 మంది నేతలు టీఎంసీలో చేరడంతో... ప్రధాన ప్రతిపక్షంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవతరించింది. 2023లో మేఘాలయాలో జరిగే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మమతా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. తామంతా టీఎంసీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పీకర్‌కు లేఖ రాశారు. ఇకపై తమను టీఎంసీ సభ్యులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వంపై మాజీ సీఎం ముకుల్ సంగ్మా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే ఢిల్లీలో మమతా పర్యటిస్తున్న సందర్భంలోనే ఈ పరిణామం జరగటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

TMC