తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది ఉమ్మ‌డి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గనున్న విష‌యం తెలిసిందే. ఎమ్మెల్సీ సీట్లు ఆశీంచిన కొంద‌రు నిరాశ‌లో ఉంటే స్థానిక సంస్థ‌ల నాయ‌కులు ప్ర‌భుత్వంపై కోపంతో ఉన్నారు. దీంతో నామినేష‌న్ చివ‌రి రోజు కొంద‌రు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. అయితే, నామినేష‌న్లు వెన‌క్కి తీసుకునేందుకు గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఎమ్మెల్యేలు, మంత్రులు రంగంలోకి దిగారు. నామినేష‌న్లు వేసిన వాళ్ల‌తో అప్పుడే మంత‌నాలు ప్రారంభించారు. వాళ్లు అడిగినవి కాద‌న‌కుండా హామీలు ఇచ్చిన‌ట్టు స‌మాచారం.


   మంత్రుల నిధులు, ఎమ్మెల్యేల నిధుల‌తో పాటు ఎంపీల నిధులు కూడా కేటాయించి గ్రామాల్లో అభివృద్ది ప‌నులు చేయించ‌డానికి అక్క‌డి స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధుల మ‌ధ్య హామి ఇచ్చినట్టు తెలుస్తోంది.  కానీ, స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే వ‌ర‌కు వెన‌క్కు త‌గ్గేది లేద‌ని కొంద‌రు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బాహాటంగానే చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇక క‌రీంన‌గ‌ర్‌, న‌ల్గొండ జిల్లాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీల‌తో సమావేశం అయ్యారు మంత్రులు, ఎమ్మెల్యేలు. నామినేష‌న్లు వేసిన వాళ్ల వ్యాపారాలు, ఇత‌ర ప‌నులు, వాళ్లు ఎక్క‌డెక్క‌డ తిరుగుతున్నార‌నే వివ‌రాల‌ను సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు.


 తాము చెప్పిన‌ట్టు విన‌కుంటే నామినేష‌న్లు వేసిన వారి వ్యాపారాలు దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు  తెలుస్తోంది. ఇండిపెండెంట్లు పోటీలో నిలిస్తే అధికార పార్టీకి త‌ల‌నొప్పిగా మారే అవ‌కాశం ఎదుర‌వుతుంది.  నామినేష‌న్‌ల దాఖ‌లుకు చివ‌రి రోజు కావ‌డంతో రంగారెడ్డి జిల్లాలో నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఎంపీటీసీల సంఘం నుంచి బరిలో ఉంటామ‌ని చెప్పిన ఓ ఎంపీటీసీ చివ‌రికి నామినేష‌న్ వేయ‌లేదు. ఇంకా మ‌రికొన్ని జిల్లాల్లో నామినేష‌న్లు దాఖ‌లు చేసేందుకు ఎవ‌రు రావొద్ద‌ని అధికార పార్టీకి చెందిన నేత‌లే హుకుం జారీ చేసిన‌ట్టు స‌మాచారం. అయితే, ప్ర‌స్తుతం నామినేష‌న్ వేసిన వారిలో ఎంత‌మంది ఉప‌సంహ‌రించుకుంటారు.. ఎంత‌మంది చివ‌రి వ‌ర‌కు పోటీలో నిలుస్తార‌నేది చ‌ర్చ‌గా మారింది. దీనికి తోడు టికెట్లు రాని అసంతృప్త నేత‌లు కూడా వెనుకుండి వారిని ప్రోత్స‌హించే అవ‌కాశం ఉన్న‌ట్టుగా  క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: