గులాబీ దండుకు ఇవాళ అనేక స‌వాళ్లున్నాయి. నీళ్లు నిధులు నియామ‌కాలు అన్న నినాదంతో రాజ‌కీయం చేసినా లేదా ఇప్ప‌టికీ చేస్తున్న కేసీఆర్ కు వరుస ప‌రాజ‌యాలు కొంత బాధ‌పెట్టినా అవేవీ త‌న స్థాయిని త‌గ్గించ‌లేవ‌ని  ఎప్ప‌టిక‌ప్పుడు చెప్పేందుకు ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నం, అందుకు ఎంచుకుంటున్న భాష అన్న‌వి క్షేత్ర స్థాయిలో నిల‌దొక్కుకుంటున్నాయి. దూసుకుపోతున్నాయి. అదే స‌మ‌యంలో తెలంగాణ కోసం ఢిల్లీ పెద్ద‌లు ఏమీ చేయ‌డం లేదని యాసంగిలో దిగుబ‌డి వ‌చ్చిన  వ‌డ్లు కొనుగోలుకు ఆస‌క్తి చూప‌డం లేద‌ని పేర్కొంటూ త‌న‌దైన నిర‌స‌న తెలిపి రైత‌న్న‌ల సానుభూతినో మ‌ద్ద‌తునో పొందేందుకు బాగానే కృషి చేశారు. అయితే ఈ చర్య ఎలాంటి ఫ‌లితం ఇస్తుంది రైతులంతా కేసీఆర్ కు అనుకూల‌మేనా అంటే ఇప్ప‌టికిప్పుడు చెప్ప‌లేం కానీ ప్ర‌జ‌ల దృష్టిని అయితే ఈ ఒక్క చ‌ర్య‌తో బాగానే ఆక‌ర్షించ‌గ‌లిగారు అన్న‌ది మాత్రం వాస్త‌వం. ఇలాంటి నిర‌స‌న‌ల  కార‌ణంగా గులాబీ దండు ఓటు బ్యాంకు మెరుగుప‌డుతుందా అంటే అదొక సందేహాస్ప‌ద‌మే! మ‌రొక్కసారి కేసీఆర్ కూడా రైత‌న్నల విష‌య‌మై పున‌రాలోచ‌న చేసి, కేంద్రం క‌న్నా రాష్ట్రం ఏవిధంగా సేద్య‌గాడికి త‌న‌వంతు భ‌రోసా అందించిందో వివ‌రిస్తే, ఆ విధంగా ఎంచుకున్న ప్ర‌ణాళిక‌లు ఆచ‌రిస్తేనే ఫ‌లితాలు. లేదు అంటే రైత‌న్న కోసం కేసీఆర్ చేసిన‌ దీక్ష‌లు అన్నీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే అన్న విప‌క్ష వాద‌న నిజం కాక త‌ప్ప‌దు.

తెలంగాణ ఇంటి పెద్ద‌గా కేసీఆర్ మంచి పేరే తెచ్చుకుంటున్నారు. తెలంగాణ‌ను సాధించిన సాధించేందుకు కృషి చేసిన ఉద్య‌మ పార్టీ అధినేతగా నాడు నేడు ఒకే విధంగా ప‌నిచేస్తూ త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు కేసీఆర్. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు కొన్ని ఒడిదొడుకులు ఎదుర‌యినా ఇబ్బందులు ఉన్నా కూడా అత్యంత చాక‌చ‌క్యంగా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తూ ముందుకు దూసు కుపోతున్నారు. ఓ వైపు కేంద్రంతో క‌య్యంకు కాలు దువ్వుతూనే మ‌రో వైపు రాజ‌కీయ అవ‌స‌ర‌త‌ల నేప‌థ్యంలో స‌ఖ్య‌త పాటిస్తూ బ‌హుముఖీన వ్యూహం ఒక‌టి అవ‌లంబిస్తున్నారు.


పార్టీకి సంబంధించిన వ్య‌వ‌హారాల్లోనూ అదేవిధంగా రాష్ట్రాన్ని న‌డిపే వ్య‌వ‌హారాల్లోనూ కేసీఆర్ త‌న మాటే వేదం త‌న మాటే శాస‌నం అన్న స్థాయిలో  ద‌క్ష‌త చూపుతున్నారు. కొన్ని క్లిష్ట స‌మ‌యాల్లో రాజ‌కీయంగా ఒడిదొడుకులు ఎదుర‌యినా కూడా అవేమంత పెద్దవి కావ‌ని, త‌న‌ని కాద‌ని రాష్ట్రంలో మ‌రో పార్టీ ఎదిగేందుకు ఆస్కార‌మే లేద‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా ఆ రోజు చేసిన కృషిని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌స్తావిస్తూనే ప్ర‌జ‌ల్లో నాటి భావోద్వేగం మ‌రొక్క‌మారు నిల‌దొక్కుకునేలా త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. అంతేకాదు ఉచిత ప‌థ‌కాల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు కానీ ద‌ళిత బంధులాంటి ప‌థ‌కాల‌తో సంబంధిత వ‌ర్గాల్లో మంచి క్రేజ్ అయితే తెచ్చుకున్నారు. దేశం యావ‌త్తూ తెలంగాణ వైపు చూసేలా ఈ ఒక్క ప‌థ‌కంతో నేష‌న‌ల్ మీడియాను సైతం  కేసీఆర్ విప‌రీతంగా ఆక‌ర్షించారు అన్న‌ది వాస్త‌వం. ఇదే నూరు పైస‌ల నిజం కూడా!
 

మరింత సమాచారం తెలుసుకోండి: