దేశంలో సెమీ ఫైనల్ పోరుకు సమయం దగ్గర పడుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ స్థాయిలో ఆసక్తి రేపే ఎన్నికలు ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ప్రస్తుతం అన్ని పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. యూపీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన పార్టీకే జాతీయ స్థాయిలో చక్రం తిప్పగలదని అంతా భావిస్తున్నారు. అందుకే దాదాపు మూడేళ్లుగా యూపీలో మకాం వేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు. యూపీని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రియాంక గాంధీ వాద్రా గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక అధికార భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు కూడా యూపీ కోసం పావులు కదుపుతున్నారు. యూపీ ప్రజలపై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపిస్తున్నారు కూడా. ఇదే సమయంలో పొత్తుల అంశంపై కూడా తెరపైకి వచ్చింది. గతంలో పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ... ఈ సారి మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు కూడా. ఇక సమాజ్ వాదీ పార్టీ కూడా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది.

మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ అసెంబ్లీని సొంతం చేసుకోవాలంటే... ప్రస్తుతం ఒంటరిగా సాధ్యం కాదని... పొత్తు తప్పని సరి అని భావించినట్లు ఉన్నారు మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. అందుకే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు అఖిలేష్. గతంలో కాంగ్రెస్, బీఎస్పీలతో కలిసి పోటీ చేసిన అఖిలేష్... ఈ సారి మాత్రం తప్పకుండా అధికారం దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న యోగీ ఆదిత్యానాథ్ నేతృత్వంలోని కమలం పార్టీని గద్దె దింపాలని అన్ని పార్టీలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. యోగీ హయాంలో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని అఖిలేష్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఆప్‌తో కలిసి పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే అఖిలేష్ ప్రకటించారు. అయితే సీట్ల పంపకంపై మాత్రం ఇంకా రెండు పార్టీ మధ్య చర్చలు జరుగుతున్నాయని అఖిలేష్ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: