ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తిరుపతి నగర వాసులకు మరో సారి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి అర్బన్ పోలీసులు సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి రంగంలో ఎన్‌డీఆఫ్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపధ్యంలో అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం నిమిత్తం ప్రత్యేక బృందాలను అప్రమత్తం చేశారు. పలు కీలక సూచనలు కూడా ప్రజలకు చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 26 నుంచి డిసెంబర్ 2 వరకు అతి భారీగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

భారీ వర్షాలు రానున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.... అత్యవసరం అయితేనే ప్రజలు గానీ, వాహనదారులుగానీ బయటకు రావాలని పోలీసులు సూచించారు. ప్రజలు ప్రమాదాల భారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షం కురుస్తున్న సమయంలో విధ్యుత్ పోల్స్, చెట్ల కింద నిలబడవద్దన్నారు. పాత భవనాల కింద, చెట్ల కింద, విధ్యుత్ స్థంబాలు ఉన్న ప్రాంతాలలో ప్రజలు ఉండరాదని హెచ్చరించారు. ఈ సమయంలో ప్రస్తుతం నిండిన చెరువులు పొంగే అవకాశం ఉంది. నదులు, కాలువలు వరద నీటితో ఉధృతంగా ప్రవహించ వచ్చు. పలు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియాలలో భయాందోళనలు కలిగించవద్దని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియా, వాట్సప్ లలో వచ్చే కొన్ని వార్తలను అతిగా నమ్మవద్దన్నారు. ట్రాఫిక్‌ మళ్లింపు సమయంలో అత్యవసర వాహనాలకు ఆటంకం కలిగించరాదన్నారు. అత్యవసర పరిస్థితులలో సహాయం కోసం డయల్ 100, 8099999977, 63099 13960 నెంబర్లకు సమాచారం అందిస్తే వెంటనే సంబంధిత రెస్క్యు ఆపరేషన్ పోలీసు సిబ్బంది సహాయం అందించడానికి అందుబాటులోకి వస్తారని తిరుపతి అర్హన్ ఎస్పీ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: