కరోనా తర్వాత ప్రపంచం తట్టుకోలేని స్థాయిలో ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని చెబుతున్నాయి అంతర్జాతీయ సంస్థలు. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చేసిన హెచ్చరికల ప్రకారం ముందు ముందు ఆహారం కోసం మానవాళి మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పటికే కరోనా తర్వాత ఆహార ధాన్యాల ధరలు భారీగా పెరిగిపోయాయి. వాతావరణ సమతుల్యం దెబ్బతిని అతివృష్టి, అనావృష్టితో ఎక్కడికక్కడ పంటలు నాశనం అవుతున్నాయి. ఫలితంగా ఉత్పత్తి తగ్గిపోయి నిత్యావసరాలు కూడా సామాన్యులకు అందనంత ఎత్తుకి చేరుకుంటున్నాయి.

FAO అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 300కోట్ల మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. అంటే ప్రపంచ జనాభాలో ఇది దాదాపుగా మూడో వంతు. కరోనా విలయంలో జీవనోపాది కోల్పోయి, ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న ప్రజలు కనీసం పూర్తి స్థాయిలో ఆహారానికి సరిపడా సంపాదించలేకపోతున్నారని చెబుతున్నాయి సర్వేలు. తినేందుకు తిండి లేక ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల మంది తీవ్రంగా బాధపడుతున్నారని అంచనా.

రాను రాను సమస్య తీవ్రం..
ఇప్పటికే పాకిస్థాన్‌ వంటి దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అక్కడ పాల ఉత్పత్తులు, చక్కెర, పెట్రోలు రేట్లు చుక్కలనంటాయి. పాకిస్తాన్ లో సింగిల్ కాఫీ 200 రూపాయలు, పిజ్జా 500 రూపాయలకు చేరుకున్నాయి. ద్రవ్యోల్బణం అక్కడ 70 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరుకుంది. ది న్యూస్ నివేదిక ప్రకారం పాకిస్తాన్‌ లో ఆహార ధరలు ఏడాదిన్నర వ్యవధిలో రెండింతలు పెరిగాయి. ఒక్క పాకిస్తాన్ లోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఆహార ధాన్యాల లభ్యత తగ్గిపోయి, దిగుమతులు నిలిచిపోయి అవస్థలు పడుతున్నారు ప్రజలు. ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించిన దేశాల్లో మాత్రమే ప్రజలకు కాస్త ఊరట. అయితే భారత్ లాంటి దేశాల్లో కూడా ఆహారంపై పెట్టాల్సిన ఖర్చు భారీగా పెరిగిపోయింది. ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడంతోపాటు, పంట నష్టం కూడా కోలుకోలేని దెబ్బ తీస్తోంది. దీంతో సగటు మధ్యతరగతి మానవుడు ఆహారం కోసం కేటాయించాల్సి నెలవారీ బడ్జెట్ భారీగా పెరిగిపోతోంది. ఇతర అవసరాలు తగ్గించుకోలేక, ఆహారంపై అంత భారీ మొత్తం వ్యయం చేయలేక ప్రజలు పోషకాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: