ఓ భారతీయుడిగా మనం దేశం గురించి కొన్ని అంశాలు తప్పకుండా తెలుసుకోవాలి. అది పౌరుడిగా మన బాధ్యత.. ఈనాటి కుర్రాళ్లకు స్వాతంత్ర్య దినోత్సవానికి, రిపబ్లిక్ దినోత్సవానికీ తేడా తెలియకుండా పోతోందని పెద్దలు విసుక్కుంటుంటారు. అందుకే ఇవాళ్టి ప్రత్యేకత అయిన భారత రాజ్యాంగ దినోత్సవం గురించి కూడా తెలుసుకుందాం. స్వాతంత్ర్య దినోత్సవం తెలుసు.. రిపబ్లిక్ దినోత్సవం తెలుసు కానీ.. ఈ రాజ్యాంగ దినోత్సవం ఏంటి అనుకుంటున్నారా.. అదే తెలుసుకుందాం..


మన దేశ మనుగడకు భవిష్యత్‌కు మూలాధారం మన రాజ్యాంగం. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశం నడిచేదే రాజ్యాంగం ద్వారా. ప్రతి దేశానికి ప్రభుత్వం ఎలా సాధారణమో.. రాజ్యాంగమూ అలా సర్వసాధారణం. ప్రభుత్వం శరీరమైతే, రాజ్యాంగం దాని ఆత్మ అని చెప్పొచ్చు. ప్రభుత్వాలు ఎలా నడుచుకోవాలో చూపించేదే రాజ్యాంగం.  మన రాజ్యాంగాన్ని అంబేడ్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ కమిటీ రూపొందించిందని తెలుసు. ఈ రాజ్యాంగ రచన 1949 నవంబర్ 26 నాటికే పూర్తయింది. ఆరోజే రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడింది.


అయితే.. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ రాజ్యాంగం జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చింది. దాన్నే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే.. రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్‌ 26ను ఏటా రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. 2015లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26న ఏటా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


అప్పటి నుంచి  ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇక మన రాజ్యాంగంలో అవతారికకు చాలా ప్రాముఖ్యత ఉంది. రాజ్యాంగ నిర్మాణం ద్వారా భారతీయులు తమకు తాము అందివ్వదలచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పట్ల తమ నిబద్ధతను, దీక్షనూ ఈ అవతారికలో ప్రకటించారు.  భారత ప్రజలమైన మేము, భారత్‌ను సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని సంకల్పించామని తెలిపారు. అందుకే నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: