దేశాన్ని పాలించే శ‌క్తుల నీడ‌ల నుంచి
విముక్తం కోరుకోవాలి
సామాజిక న్యాయం కోసం ప‌రిత‌పించే
శ‌క్తులు కొన్ని మ‌రింత‌గా ప‌నిచేయాలి
వినేందుకు పాటించేందుకు ఇవ‌న్నీ మంచివే!
కానీ మ‌న‌ల్ని మించిన వేద‌న ఒక‌టి
బాధిత వ‌ర్గాల్లో ఉంది.. మ‌నం చేయాల్సింది
చుట్టూ ఉన్న మ‌నుషుల‌కు న్యాయ సాయం అందించడం
వ్య‌వ‌స్థ‌ల్లో గుడ్డిత‌నం బేలత‌నం పోగొట్ట‌డం..


దేశాన్నీ రాజ్యాంగాన్నీ ప్రేమించ‌డం నేర్చుకోండి. స‌వ‌ర‌ణ‌లు ఎన్ని ఉన్నా అవ‌న్నీ సామాన్యుడికి మేలు చేస్తే చాలు. అవే మ‌న మ‌నుగ‌డ‌కు మూలం. అవే మ‌న స‌మాజ ఉన్న‌తికి కార‌ణం. ఇవేవీ లేకుండా ఓ ప్రాంతం నుంచి ఓ వ‌ర్గం నుంచి మీరు ఓటు ను అడ‌గ‌కండి నాయ‌కులారా! అలానే ఓ ప్రాంతం నుంచి ఓ స‌మాజం నుంచి మీరు దేనినీ ఆశించ‌కండి నాయ‌కులారా! దేశాన్నీ మ‌నిషినీ మ‌ట్టినీ  ఒకే విధంగా చూడ‌డంతోనే మ‌న జీవితాలు మార్పున‌కు నోచుకుని ఉంటాయి. లేదా మార్పులో భాగం అయి ఉంటాయి. వైద్యుడూ నాయ‌కుడూ ఒకే విధంగా ప‌నిచేయాల‌ని చ‌దివేను. అవును! చుట్టూ ఇంత‌టి ద‌రిద్రాన్ని త‌రిమికొట్ట‌డంలో ఎవ‌రి బాధ్య‌త వారు అందుకోక ఉండిపోతే కోపం వ‌స్తుంది. లేదా అస‌హాయ‌త నుంచి వ‌చ్చిన ఉద్య‌మం ఒక‌టి గొప్ప ప‌రివ‌ర్త‌న‌కు కార‌ణం అయి ఉంటుంది. క‌నుక రాజ్యం లో ద‌ళిత అణ‌గారిన వ‌ర్గాల ఉన్న‌తిలో ఓ భాగం రాజ్యాంగాన్ని సుముచిత స్థానంలో ఉంచి అమ‌లు చేయ‌డం. అదే  బీఆర్ అంబేద్క‌ర్ ఇచ్చిన స్ఫూర్తి. కానీ మ‌న ద‌గ్గ‌ర ఇప్ప‌టికీ స్టేష‌న్ సెటిల్మెంట్లు హాయిగా అమ‌లువుతున్నాయి. నాయ‌కులు ఇష్టారాజ్యంగా ఉన్నారు. అలాంట‌ప్పుడు మంచి పాల‌న అన్న‌ది ఎలా వ‌స్తుంద‌ని? క‌నుక ఆశించ‌డానికి అర్హ‌త  కావాలి. కొన్ని వ్య‌క్తం చేయ‌డానికి కూడా అర్హ‌త కావాలి. స‌మూహ కాంక్ష‌లు అన్న‌వి స‌మూల మార్పుల నుంచి సంబంధిత ప్ర‌క్షాళ‌న రీతి నుంచి వస్తాయి. అదే మేలు కూడా!


రాజ్యంలో బ‌ల‌హీనుల‌కు ఒక న్యాయం కావాలి. అలానే బ‌ల‌మ‌యిన వారిని నిలువ‌రించే న్యాయం ఒక‌టి తప్ప‌క ఉండాలి. ఇవి లేకుండా ఉంటే సామాన్యుల‌కు క‌ష్టమే. వారి క‌ష్టం తీర్చేవారు గ‌గ‌న‌మే! మ‌నం ఇంత‌టి స్వేచ్ఛ‌నో స‌మాన‌త్వాన్నో కోరుకుంటున్నా మంటే అందుకు కార‌ణం రాజ్యాంగ‌మే. ఇవాళ రాజ్యాంగ దినోత్స‌వం. దీనినే సంవిధాన్ దివ‌స్ గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రి! రాజ్యాంగం అనుసారం రాజ‌కీయ శ‌క్తులు ఉంటున్నాయా లేదా ఎవ‌రికి న‌చ్చిన విధంగా వారు ఉంటూ స‌మాజాన్ని తోటి వారిని నిందిస్తూ పోతున్నారా ..? చ‌ట్టాలు హ‌క్కులు అన్న‌వి ఎప్పుడూ వినే ప‌దాలుగానే ఎందుకు మిగిలిపోతున్నాయి. మాన‌వ హ‌క్కుల కోసం నిమ్న జాతి కులాల సమున్న‌తి కోసం పాటు ప‌డిన అంబేద్క‌ర్ ఆశ‌యం కానీ ఆయ‌న రాజ్యాంగ ర‌చ‌న కానీ ఇవాళ మ‌న మ‌ధ్య ఎలా ఉంది. మ‌న‌తో ఎలా ఉంది. మ‌న‌లో ఎలా ఉంది అన్న‌ది ముఖ్యం.

సామాజిక న్యాయం అన్న‌ది ఎంతో అవ‌స‌రం. జై భీమ్ లాంటి సినిమాలు చెప్పిదిదే! న్యాయం జ‌ర‌గ‌డం ఆల‌స్యం అయినా కావొచ్చు కానీ న్యాయం జ‌రిగే క్ర‌మంలో బాధితులు నిరాద‌ర‌ణ‌కు  గురి కాకూడ‌దు.. ఆ విధంగా న్యాయ నిరాక‌ర‌ణకు గురికావొద్దు. ఇలాంటి సందర్భాలే పౌర స్పృహ‌ను పెంపొందిస్తాయి. లాయ‌ర్ గారు జ‌డ్జి గారు తీర్పు గురించి మాట్లాడించే మీడియా ఇవ‌న్నీ కూడా సామాన్యుల కోసం ప‌నిచేయాలి. అవును! వాళ్లంతా మాట్లాడ‌క‌పోతే బాధితులు అన‌గా నిమ్న వ‌ర్గాలు లేదా ఉన్న‌త వ‌ర్గంలో ఉన్న  
నిరాద‌ర‌ణ‌లో ఉన్న మ‌నుషులు వీళ్లంతా ఏమ‌యిపోవాలి.  రాజ్యాంగం చేదు మాత్ర లాంటిది.. రుగ్మ‌త‌ల‌తో నిండిన  స‌మాజానికి అది అవ‌స‌రం. అస‌లు సంస్క‌ర‌ణ లేకుండా మంచి అన్న‌ది నిల‌బ‌డ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని!

మరింత సమాచారం తెలుసుకోండి: