రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కష్టమని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో నిర్వహించన కార్యక్రమంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్, కేంద్రమంత్రులు  పాల్గొన్నారు. అంబేడ్కర్ దేశానికి రాజ్యాంగాన్ని కానుకగా ఇచ్చారని మోడీ చెప్పారు. పార్టీలు కుటుంబపరమవుతున్నాయనీ.. కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడలేవన్నారు.

భారత్ తో పాటు ఒకే సమయంలో స్వాతంత్ర్యం పొందిన దేశాల కంటే ఇండియా ముందుందని ప్రధాని మోడీ అన్నారు. మనం చేరాలనుకున్న లక్ష్యాలను కలిసికట్టుగా సాధించామన్నారు. వందల ఏళ్ల పరాయి పాలన దేశాన్ని అనేక సమస్యల్లోకి నెట్టిందన్నారు. ఒకప్పుడు బంగారు పక్షిగా పిలవబడిన భారత్.. పేదరికం, ఆకలి, వ్యాధులతో బాధపడిందన్నారు. ఈ క్రమంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రాజ్యాంగం సాయపడినట్టు చెప్పారు ప్రధాని మోడీ.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. దేశాభివృద్ధిలో రాజ్యాంగమే కీలకపాత్ర పోషించిందని పేర్కొన్నారు. భారత ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా రాజ్యాంగం నిలిచిందన్నారు. రాజ్యాంగాన్ని డిజిటల్ రూపంలో అందుబాటులోకి తెచ్చామనీ.. దాన్ని యువత అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు.

ఇక హైదరాబాద్ రాజ్ భవన్ లో జరిగిన 72వ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్ తమిళిసై, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర, మంత్రులు కేటీఆర్, తలసాని, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. రాజ్యాంగం వల్లే భారతదేశం బలంగా ఉందనీ.. ఏడు దశాబ్దాలుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దృఢంగా నిలిచిందని గవర్నర్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ఇంకా పోలేదనీ.. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు.


మొత్తానికి భారత రాజ్యంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు అద్భుతమైన ప్రసంగం చేశారు. భారత రాజ్యాంగ విలువలను ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. భావితరాలు కూడా రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.



 



మరింత సమాచారం తెలుసుకోండి: