‘వలస పక్షులకు ఇకనుండి పార్టీలో చోటుండదు’ అంటు తాజాగా చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన భలే క్యామిడీగా ఉన్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గం ఇన్చార్జిగా దేవగుడి భూపేష్ రెడ్డిని నియిమించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. వలసపక్షులకు ఇకనుండి పార్టీలో చోటుండదని ఒకవేళ చేర్చుకోవాల్సొచ్చినా కీలక పదవులు మాత్రం ఇచ్చేది లేదని చెప్పారు. పైగా జమ్మలమడుగు టీడీపీకి కంచుకోటగా చెప్పటమే పెద్ద జోక్.

ఎందుకంటే జమ్మలమడుగులో 1999 ఎన్నికల తర్వాత మళ్ళీ ఇప్పటివరకు టీడీపీ గెలిచిందే లేదు. అంటే గడచిన నాలుగు ఎన్నికల్లో గెలవని టీడీపీకి ఈ నియోజకవర్గం ఎలాగ కంచుకోటైందో చంద్రబాబే చెప్పాలి. 1955-2019 వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచింది కేవలం నాలుగుసార్లు మాత్రమే. నియోజకవర్గం చరిత్రలోనే నాలుగుసార్లు గెలిచి వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడిపోతున్న టీడీపీని చంద్రబాబు కంచుకోటని చెప్పటమే విచిత్రంగా ఉంది.

ఇక వలసపక్షుల గురించి చంద్రబాబు చెప్పటం ఏమాత్రం మ్యాచ్ కాలేదు. కారణం ఏమిటంటే ఇప్పటికిప్పుడు టీడీపీలో చేరే నేతలు కూడా ఎవరు లేరు. పైగా టీడీపీలో నుండే బీజేపీలోకి కొందరు నేతలు వెళ్ళిపోగా మరికొందరు నేతలు చేరేందుకు రెడీగా ఉన్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. టీడీపీ నుండి వెళ్ళిపోయే నేతలను నిలుపుకోవటమే చంద్రబాబుకు పెద్ద సమస్య. అలాంటిది ఇతర పార్టీల నుండి టీడీపీలో చేరే నేతలెవరుంటారో చంద్రబాబుకే తెలియాలి.

అన్నింటికన్నా పెద్ద జోక్ ఏమిటంటే ఇపుడు జమ్మలమడుగు బాధ్యతలు అప్పగించింది కూడా వలసపక్షికే. దేవగుడి ఫ్యామిలి మొదటినుండి కాంగ్రెస్ లోనే ఉండేది. ఈ ఫ్యామిలీ తరపున కాంగ్రెస్ నుండి ఆదినారాయణరెడ్డి రెండుసార్లు కాంగ్రెస్ తరపున ఎంఎల్ఏగా గెలిచారు. 2014లో వైసీపీ తరపున మూడోసారి గెలిచిన ఆదినారాయణరెడ్డిని ప్రలోభాలకు గురిచేసి చంద్రబాబు టీడీపీలోకి లాక్కుని మంత్రిపదవి కూడా కట్టబెట్టారు.

ఆదినారాయణరెడ్డితో పాటు ఆయన సోదరుడు నారాయణరెడ్డి, ఆయన కొడుకు భూపేష్ రెడ్డి టీడీపీలోకి ఫిరాయించారు. అప్పటినుండి 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయేంతవరకు ముగ్గురు టీడీపీలోనే ఉన్నారు. ఆ తర్వాత టీడీపీలో ఉండి ఉపయోగం లేదని అర్ధమైపోవటంతో సోదరులు మళ్ళీ వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవటంతో ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోయారు.

బీజేపీలో చేరటం ఇష్టంలేక,  వేరేదారి లేక నారాయణరెడ్డి, కొడుకు భూపేష్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. ఆ తండ్రీ, కొడుకులనే ఇపుడు చంద్రబాబు టీడీపీలో చేర్చుకుంటున్నట్లు బిల్డప్ ఇచ్చి కొడుక్కి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇదంతా చూసిన వాళ్ళకు చంద్రబాబు భలే క్యామిడి చేశారని అనుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: