ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. చివరికి జీతాలు చెల్లించేందుకు కూడా చిల్లి గవ్వ లేని పరిస్థితి. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ సర్కార్... సంక్షేమ పథకాల అమలు కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించింది. ఇదే సమయంలో కరోనా కూడా పంజా విసరడంతో... రాష్ట్రానికి ఆదాయం రాకుండా పోయింది. దీంతో పథకాల కోసం అప్పులు చేసేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. చివరికి రుణ పరిమితి కూడా దాటి పోవడంతో... చేసేది లేక... ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టేసింది. అలాగే తమకు రుణ పరిమితి పెంచాలంటూ కేంద్రానికి వరుస లేఖలు రాసింది. ఆదాయం పొతుందనే భయంతో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ట్యాక్స్ కూడా తగ్గించేది లేదని తేల్చేసింది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఓ నివేదిక బయట పెట్టింది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. 2019-20  ఏడాదికి సంబంధించిన నివేదికను కాగ్ బయటపెట్టింది. ఇందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేసింది కాగ్.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాన్ని కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆర్థిక నిర్వహణ, అప్పులు, వాటి చెల్లింపులు, బడ్జెట్ కేటాయింపులు, అమలు, అసెంబ్లీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తీసుకునే నిర్ణయాలపై కాగ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు ప్రభుత్వ విధానమే సరిగ్గా లేదంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది కాగ్. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని కాగ్ ఆవేదన వ్యక్తం చేసింది. పరిస్థితి ఇలాగే ఉంటే... భవిష్యత్తులో రాష్ట్రానికి తీవ్ర ప్రతికూల పరిణామాలు తప్పవంటూ కాగ్ హెచ్చరికలు కూడా చేసింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వ లోపాలను సరి చేసుకోవాలి కాగ్ సూచించింది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా అప్పులు పేరుకు పోయాయని నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం తీసుకున్న అప్పులు చెల్లించలేక ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడుతోందని కాగ్ నివేదికలో తెలిపింది. సభకు తెలియకుండా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని కాగ్ స్పష్టం చేసింది. బడ్జెట్ నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. 2020 మార్చి నాటికి పూర్తైన పద్దుల ఆధారంగానే ఈ రిపోర్టును తయారు చేసిన కాగ్... తన నివేదికను అసెంబ్లీకి సమర్పించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: