ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరుణుడు పగబట్టినట్లు పరిస్థితి కనిపిస్తోంది. ఓ వైపు చలికాలం సమీపిస్తున్నా కూడా... రాష్ట్రంలో వర్షాలు మాత్రం తగ్గటం లేదు. దాదాపు 15 రోజులుగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా వరదలు ప్రజలను నిలువునా కుదిపేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా.. రాయలసీమ ప్రాంతం తడిసి ముద్దయ్యింది. కడప జిల్లాలో అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు తెగిపోయాయి. ఊళ్లకు ఊళ్లు నీటిలో మునిగిపోయాయి. ఒక్క కడప జిల్లాలోనే ఇప్పటి వరకు సుమారు 40 మంది వరకు మృతి చెందారు. ఇక చిత్తూరు జిల్లాలో అయితే పరిస్థితి అత్యంత దారుణం. తిరుపతి  పట్టణం మొత్తం మూడు రోజుల పాటు నీటిలో నానిపోయింది. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. ఆ నష్టం నుంచి ఇంకా కోలుకోక ముందే... మరో పిడుగు లాంటి వార్తను విశాఖ వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ అధికారులు ప్రకటించారు.

సోమవారం నుంచి దక్షిణ అండమాన్ వద్ద బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. అలాగే ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిస్తాయన్నారు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఇక ప్రధానంగా నెల్లూరు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు హై అలర్ట్ జారీ చేసింది విశాఖ వాతావరణ శాఖ. అదే సమయంలో చెన్నై సహా తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. తమిళనాడులో ఆదివారం నుంచే వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాయుగుండం సోమవారం ఉదయానికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తుపాను విస్తరించి ఉందన్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి... వచ్చే నెల 2వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: