వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజు. ఫ్యాను గుర్తుపైనే గెలిచినప్పటికీ... ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ... సొంత పార్టీలోనే ప్రతిపక్షంలా వ్యవహరిస్తున్నారు రఘురామ. తొలి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక మరో అడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనితో రఘురామ కృష్ణంరాజుపై బహిష్కరణ వేటు వేయాలంటూ వైసీపీ ఎంపీలు పార్లమెంట్ స్పీకర్‌కు లేఖ కూడా రాశారు. ఆ నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉండటంపై కూడా వైసీపీ తప్పుబడుతోంది. ఇక జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రఘురామ కృష్ణంరాజుపై రాజద్రోహం కూడా కేసు కూడా పెట్టి అరెస్ట్ చేసింది ఏపీ సీబీసీఐడీ అధికారులు. దీనిపై కూడా పెద్ద దుమారమే రేగింది అప్పట్లో. అయితే ఏ మాత్రం వెనక్కి తగ్గని రఘురామ సొంత పార్టీ ఎంపీల తీరుపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఎంపీ లాడ్స్ దుర్వినియోగం అయ్యాయంటూ ఆర్ఆర్ఆర్ చేసిన ఫిర్యాదు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.

బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తన ఎంపీ లాడ్స్ నిధుల్లో సుమారు 40 లక్షల రూపాయలను చర్చిల నిర్మాణం కోసం కేటాయించారు. దీనిపై కేంద్రానికి రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన కేంద్రం... గతంలోనే ఏపీ ప్రభుత్వాన్ని కూడా వివరణ కోరింది. అయితే దీనిపై ఏపీ సర్కార్ ఏ మాత్రం స్పందించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం... ఇప్పుడు మరోసారి వివరణ కోరింది. సాధారణంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్రం ఎంపీ లాడ్స్ కేటాయిస్తుంది. వీటిపై ఆడిటింగ్ కూడా జరుగుతుంది. ఈ ఆడిటింగ్‌లో బాపట్ల ఎంపీ సురేష్... ఓ చర్చి నిర్మాణానికి నిధులు ఖర్చు చేసినట్లు  ఆర్ఆర్ఆర్ ఆరోపించారు. కేవలం మతపరమైన నిర్మాణానికి నిధులు ఇవ్వడం పార్లమెంట్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. మత మార్పిడులకు కూడా నిధులు వినియోగిస్తున్నట్లు రఘురామ తన ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై ఇప్పుడు కేంద్రం ప్రధానంగా దృష్టి సారించింది. సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. మరి ఏపీ సర్కార్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: