ఇద్ గౌరవ సభ కాదు, కౌరవ సభ అంటూ మంచి రైమింగ్ తో టైమింగ్ తో చంద్రబాబు ఎమోషనల్ డైలాగులు చెప్పి మరీ శాసన సభను వీడారు. ఆయన ఇక మీదట జనంలోనే ఉంటూ తేల్చుకుంటాను అని కూడా అంటున్నారు. అయితే చంద్రబాబు శాసన సభకు ఇక రాను అని అనడం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

బాబు లాంటి సీనియర్ చూడని రాజకీయ సన్నివేశాలు ఏవీ లేవు. నిజమే అసెంబ్లీలో బాబుకు అవమానం జరిగింది. ఆన్ రికార్డుగా ఎవరూ ఏమీ అనలేదు అంటున్నా రన్నింగ్ కామెంటరీగా కొందరు అన్నారు అని చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు తనకు అవమానం జరిగిన సభలోనే ఆ వ్యవహరం తేల్చుకోవాల్సింది అన్న వారే ఎక్కువ మంది ఉన్నారు. సభలో జరిగిన వాటి మీద జనాలు అప్పటికపుడు  తీర్పు ఇవ్వలేదు. అయితే వారు ఇచ్చే తీర్పు ఎన్నికల వేళలోనే ఉంటుంది.

చూడబోతే సార్వత్రిక ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి. అందువల్ల చంద్రబాబు ఈ లోగా సభకు వెళ్ళి విపక్ష నేతగా తన బాధ్యతలను నిర్వహించాలని డిమాండ్ మేధావుల నుంచి ఇతర వర్గాల నుంచి వస్తోంది. ఇపుడు అదే మాటను ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అంటున్నారు. బాబు సభకు వెళ్ళాల్సిందే అన్నది ఆయన మాట. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ ఉండాలి, అపుడే అది సార్దకం అని ఆయన మాట. నిజమే చంద్రబాబు చాలా అంశాల మీద అధికార పార్టీని నిలదీయాలి అనుకుంటే కచ్చితంగా శాసనసభ కంటే వేదిక మరోటి ఉండదు.

ముఖ్యంగా రాను రానూ అనేక సమస్యలు ఏపీలో పెరుగుతాయి. ప్రజలు ఒక ఎమ్మెల్యేగా  గెలిపించి ప్రధాన పక్ష నాయకుడిగా  అవకాశం ఉండి కూడా  బాబు మిగిలిన వారి మాదిరిగా బయట నుంచి మాట్లాడితే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు, మరి బాబు ఈ విషయంలో పునరాలోచించుకుంటారా అంటే జవాబు ఇపుడే ఎవరూ చెప్పలేరు. ఏది ఏమైనా బాబు మాత్రం సభకు వెళ్లాల్సిందే అన్న వారే ఎక్కువ మంది ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: