కరోనా నుంచి ప్రపంచం క్రమంగా కోలుకుంటుందనుకుంటున్న సమయంలో కొత్తగా కరోనా వైరస్‌లో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్ ఒమ్రికాన్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మళ్లీ కరోనా నాటి చీకటి రోజులు వస్తాయా.. మళ్లీ లాక్‌ డౌన్లు తప్పవా.. మళ్లీ ఎందరో కరోనా కాటుకు బలవ్వాల్సిందేనా అన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఈ ఒమ్రికాన్ ఇండియాలో అడుగుపెట్టిన దాఖలాలు కనిపించడం లేదు.


అయితే.. దక్షిణాఫ్రికాలో ఊపిరిపోసుకున్న ఈ ఒమ్రికాన్.. మన బెంగళూరుకు వచ్చేసిందేమో అన్న కలకలం నిన్న కనిపించింది. దక్షిణాఫ్రికా నుంచి ఇండియా వచ్చిన ఇద్దరిలో కరోనా పాజిటివ్ వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి అనగానే .. వామ్మో.. ఇంకేముంది ఒమ్రికాన్ వచ్చేసిందేమో అని అంతా భయపడిపోయారు. ఆ ఇద్దరి శాంపిళ్లను టెస్టింగ్‌కు పంపారు. జీనోమ్‌ సీక్వెన్స్‌ చేయించారు.. అయితే.. అది డెల్టా వేరియంటేనని.. ఒమ్రికాన్ కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతానికి గండం గట్టెక్కినా.. ఈ ఒమ్రికాన్ ఎప్పుడైనా ఇండియాలో అడుగు పెట్టే ప్రమాదం లేకపోలేదు.


ఇప్పుడు ఒమ్రికాన్.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వేరియంట్‌గా గుర్తింపు పొందింది. సాధారణంగా కరోనా వంటి  వైరస్ అనేక మ్యూటెంట్లు చెంది కొత్త వేరియంట్లు పుట్టుకువస్తుంటాయి. అయితే.. ఈ వేరియంట్లు అన్నీ ప్రమాదకరమైనవి కాదు..  కొన్ని వేరియంట్లు.. అంటే ఈ డెల్టా, ఒమ్రికాన్ లాంటివి అన్నమాట.. ఇవి మాత్రం మొండి ఘటాలు.. ఒమ్రికాన్ చాలా వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది.


ఇప్పటి వరకూ వచ్చిన అన్ని కరోనా వేరియంట్లకన్నా ఈ ఒమ్రికాన్‌ చాలా పవర్ ఫుల్ అన్న వాదనలు ఉన్నాయి. అందుకే ఈ ఒమ్రికాన్‌ వేరియంట్ పేరు చెబితేనే  దేశాలు వణుకుతున్నాయి. అనేక దేశాలు ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలను నిషేధించాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ఒమ్రికాన్‌ ఇప్పటికే దక్షిణాఫ్రికాతోపాటు బోట్స్‌వానా, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌, జర్మనీ  దేశాలకు పాకేసిందట.


మరింత సమాచారం తెలుసుకోండి: