చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడాలు నిన్న‌టి వ‌ర‌కూ ఉన్నాయి. బ‌డ్జెట్ ప‌రంగా ఇలాంటి గీత‌లు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు డ‌బ్బులు ఎక్కువ‌గా వెచ్చించి సినిమాలు తీయ‌డం క‌న్నా అస్స‌లు సినిమా నిర్మాణం మానుకోవ‌డ‌మే బెట‌ర్ అన్న వాద‌న కూడా వినిపిస్తోంది. మారిన పరిణామాల‌తో షూటింగ్ లు కొన‌సాగించ‌డం అన్న‌ది త‌ల‌కు మించిన భారంగా ఉంది నిర్మాత‌ల‌కు. జ‌గ‌న్ పుణ్య‌మాని బెన్ఫిట్ షోలు లేవు. అలానే ఎక్కువ రేటుకు టికెట్ అమ్ముకునేందుకు లేదు. అద‌న‌పు షోలు వేసుకునేందుకు లేదు. ఇలా అన్ని మార్గాలూ నిర్మాత‌ల‌కు మూసుకుపోయాయి. దీంతో చిత్ర నిర్మాణం అన్న‌ది వ‌ద్ద‌నుకుని నిర్మాణ సంస్థ‌లు ఇంటి బాట ప‌డుతున్నాయి.



దేశంలోనే ఎక్కువ సినిమాలు నిర్మించి విడుద‌ల చేసే తెలుగు చిత్ర సీమ‌కు గ‌తంలో ఇంత‌టి క‌ష్టం ఎప్పుడూ రాలేదు. కోవిడ్ కార‌ణంగా వ్యాపారాలు బాగా దెబ్బ‌తిన్నాయి. ఈ స‌మ‌యంలో ఓటీటీలు కాస్త ఆదుకున్నా కూడా అవేవీ నిర్మాత‌ను సేఫ్  జోన్ ఉంచేలా లేవు. థియేట‌ర్ తో పాటు ఓటీటీ రిలీజ్ అన్న‌ది కాస్త బెట‌ర్. కానీ అన్ని సినిమాల‌కూ ఈ సిస్టం ఒకే కాదు. ఈ సంద‌ర్భంలో చిన్న సినిమాల‌కు రాయితీలు ఇవ్వాల‌ని అడిగితే జ‌గ‌న్ నుంచి కానీ కేసీఆర్ నుంచి కానీ  ఉలుకూ లేదు ప‌లుకూ లేదు. కానీ మాట ముందు మాట చివ‌ర తాము ప‌రిశ్ర‌మ సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని మాత్రం చెప్పి ముసి ముసి న‌వ్వులు న‌వ్వుతుంటారు.

సినిమాటోగ్ర‌ఫీ యాక్ట్ లో స‌వ‌రణ‌లు తీసుకువ‌చ్చి జ‌గ‌న్ అంద‌రి త‌ల‌కాయ‌లూ మార్చేశారు. మామూలుగా ఉండ‌దు మ‌నతో అన్న విధంగా ఆయ‌న నిర్ణ‌యాలు ఉన్నాయి. ఏ ముహూర్తాన టికెట్ ధ‌ర త‌గ్గింపు విష‌య‌మై నిర్ణ‌యం తీసుకున్నారో కానీ అప్ప‌టి నుంచి ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ఇంకా డీలా ప‌డిపోతూనే ఉన్నాయి. ఇప్పుడున్న టికెట్ ధ‌ర‌ల‌తో తాము థియేట‌ర్లు న‌డ‌ప‌లేమ‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో కాస్తయినా రాయితీలు ఇచ్చి ప్ర‌భుత్వాలు త‌మ‌ను ఆదుకోవాల‌ని సురేశ్ బాబు లాంటి పెద్ద నిర్మాత‌లు కోరుతున్నారు. ఇదే డిమాండ్ ను నిన్న‌టి అఖండ ప్రీ రిలీజ్ వేడుక‌లో కూడా బాల‌య్య చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలూ త‌క్ష‌ణమే చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఆదుకోవాల‌ని కోరారు. ఎందుకంటే కోవిడ్ త‌రువాత ప‌రిణామాలు మొత్తం మారిపోయాయి. లాక్డౌన్లు కార‌ణంగా ఎవ్వ‌రికీ ప‌నులు లేకుండా పోయాయి. పెద్ద సినిమాల చిత్రీక‌ర‌ణ‌లు నిలిచిపోయాయి. ఈ నేప‌థ్యంలో టికెట్ ధ‌ర‌లు త‌గ్గించి, ప‌రిమిత సిట్టింగ్ లోనే థియేట‌ర్ న‌డుపుకోవాల‌ని చెప్ప‌డంతో టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ పెద్ద‌లు త‌లలు ప‌ట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp