ఆర్థికంగా అస్స‌లు కోలుకోనివ్వ‌ని వాన‌లు కానీ వ‌ర‌ద‌లు కానీ మ‌ళ్లీ రాకూడ‌దు. ఆర్థికంగా చావు దెబ్బ కొట్టి పోయిన క‌రోనా మ‌ళ్లీ మ‌రో రూపంలో రాకూడ‌దు. క‌రోనా త‌గ్గి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వారికి మ‌ళ్లీ ఆ వైర‌స్ సోక‌కూడదు. ఇలాంటివెన్నో ఇవాళ వినిపిస్తున్నాయి. వాన‌ల కార‌ణంగా కొంత వ‌ర‌దల కార‌ణంగా ఇంకొంత పంట పోయి, ప్రాణం పోయి ఏడుస్తున్న వారికి ఏ దేవుడు
వ‌రం ఇస్తాడో? అదే స‌మ‌యంలో ఇప్పుడొక  వార్త  సామాన్యుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. కొత్త వేరియంట్ తో జాగ్ర‌త్త అని వైద్యులు చెబుతున్నారు స‌రే.. క‌ట్ట‌డి చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలు ఇస్తాయా?

వ‌రుస విప‌త్తులు వ‌రుస విల‌యాలు ఆంధ్రావ‌నిని వ‌ణికిస్తున్నాయి. వాన‌లు, వ‌ర‌ద‌ల నుంచి ఓ వైపు కోలుకునే ప్ర‌య‌త్న‌మేదో చేస్తుంటే ఈ సారి కరోనా విజృంభ‌ణ  అన్న‌ది మ‌రో పెద్ద స‌మ‌స్య‌కు  కార‌ణం కానుంది. ఇప్ప‌టికే ప్ర‌కృతి విల‌యాల కార‌ణంగా విలువైన ఆస్తులు, పంట‌లు కోల్పోయిన వారికి తాజా వార్త‌లు క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. ప్ర‌భుత్వాలు ఎంత మొత్తంలో ప‌రిహారం అందించినా స‌రే త‌మ‌కు న‌ష్టం త‌ప్ప‌ద‌ని రైతులు వేద‌న చెందుతున్నారు. అకాల వాన‌ల కార‌ణంగా పంట‌లు పోయిన వారంతా చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. చేసిన అప్పులు తీరే దారే తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఇలాంటి సంద‌ర్భంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ విజృంభ‌ణ అన్న‌ది ఓ పెనుత్పాతాన్నే తీసుకు రానుంది. ఆర్థికంగా ఏమీ లేని దేశాల‌కు ప్ర‌మాదం మాత్రం ఇంకాస్త ఎక్కువ‌గానే ఉంది. క‌రోనా రెండో ద‌శ‌లోనే ఎంతో మంది  చ‌నిపోయారు.  ఆ గోడు నుంచి ఇంకా కోలుకోక  మునుపే ఇప్పుడు వ‌చ్చిన కొత్త వేవ్ ఏ విధంగా ప్ర‌భావితం చేయ‌నుందో?

ఇంకా చెప్పాలంటే...
క‌రోనా విజృంభణ నేప‌థ్యంలో మళ్లీ ఓ కొత్త స‌మ‌స్య వెలుగు చూసింది. గ‌తంలో కన్నా కాస్త ప్ర‌మాద‌క‌ర‌మయిన వేరియంట్ ఇదే అని తేల్చేస్తున్నారు కొంద‌రు వైద్యులు. ద‌క్షిణాఫ్రికా నుంచి వ‌చ్చిన ఈ వేరియంట్ పేరు ఒమిక్రాన్ గా నిర్ణ‌యించారు. దీంతో విదేశీయుల రాక‌పోక‌ల‌పై అలానే అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల రాక‌పోక‌ల‌పై భార‌త్ అప్ర‌మ‌త్త‌మ‌యింది. భార‌త్ తో స‌హా ప‌లు దేశాలు కొత్త వేరియంట్ అంటే చాలు వ‌ణికి పోతున్నాయి. ఈ క్ర‌మంలో ఏ చేయాలో ఎలా క‌ట్ట‌డి చేయాలో పాలుపోక కొన్నిదేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి. ముందుగానే చెప్పిన విధంగా డిసెంబ‌ర్, మార్చి మ‌ధ్య కొత్త వేరియంట్ వ‌చ్చి గ‌డ‌గ‌డ‌లాడిస్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రించిన విధంగానే జ‌రుగుతుందా లేదా అన్న‌ది ఇప్పుడో ఆస‌క్తిక‌ర చ‌ర్చ.

మరింత సమాచారం తెలుసుకోండి: