ఉత్తర ప్రదేశ్... దేశంలోనే అతి పెద్ద  రాష్ట్రం. పైగా ఏకంగా 400 పై చిలుకు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న యూపీలో ఏ పార్టీ అధికారంలో ఉంటే... దేశంలో ఆ పార్టీనే చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువ. అందుకోసమే యూపీలో అధికారం కోసం అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. వచ్చే ఏడాది మార్చి నెలలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీతో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగ కసరత్తు చేస్తోంది. అందుకోసం ఇప్పటికే దాదాపు రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ యూపీ కోసం ఎత్తులు వేస్తోంది. అటు మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ పెద్దలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే యూపీ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ చేపట్టింది. రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేసి... ప్రారంభోత్సవాలు కూడా చేసేస్తోంది బీజేపీ ప్రభుత్వం. ఇప్పటికే యూపీలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఏబీపీ - సీ ఓటర్ సర్వే రిపోర్డు వెల్లడైంది.

సర్వే రిపోర్టు కమలం పార్టీ పెద్దలకు కాస్త ఇబ్బందికరంగా మారింది. అందుకు ప్రధాన కారణం యూపీ ఓటర్ల మనోగతమే. యూపీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన సర్వేలో... ఓటర్లు విలక్షణంగా స్పందించారు. ఉత్తర ప్రదేశ్ ఓటర్లు మరోసారి యోగీ ఆదిత్యానాథ్‌ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొబెట్టేందుకు దాదాపు 42 శాతం మంది ఆసక్తి చూపారు. అయితే బీజేపీ పార్టీపై మాత్రం 22 శాతం మంది విముక్తి చూపారు. యోగీ పరిపాలన చాలా బాగుందని.... కానీ... బీజేపీ నేతల తీరు మాత్రం సరిగ్గా లేదని తేల్చి చెప్పారు. ఇక 37 శాతం మంది మాత్రం యోగీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధానంగా కరోనా సమయంలో వ్యవహరించిన తీరు, ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు, లఖింపూర్ ఖేరీ ఘటన సమయంలో యోగీ సర్కార్ అత్యంత ఘోరంగా విఫలమైందని తెలిపారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేష్ యాదవ్‌లతో పోల్చుకుని చూస్తే మాత్రం... యోగీ పనితీరు సంతృప్తికరంగానే ఉందన్నారు. యోగీకి 42 శాతం మద్దతు ఇస్తే... అఖిలేష్ యాదవ్‌కు 32 శాతం మంది, మాయావతికి 15 శాతం మంది మద్దతిచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో ప్రియాంక గాంధీని చూసేందుకు కేవలం 3 శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: