ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడాలి
ప్ర‌త్యేక రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టాలి
కానీ ఇవేవీ ఉండ‌వు.. వీటిపై దృష్టే లేదు
రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావాలి
రాష్ట్రానికి చేయాల్సిన వర‌ద న‌ష్ట నివార‌ణ చేయాలి
కానీ అందుకు కేంద్రానికి మ‌న‌సు ఒప్ప‌దు
మ‌న ఎంపీలూ  ఏమీ అడ‌గ‌రు కేవ‌లం టైం పాస్ రాజ‌కీయాలే చేస్తారు
ఎందుక‌ని?;

శీతాకాల స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సారి ఏం మాట్లాడ‌తారో అన్న ఆస‌క్తి మ‌న‌కు లేక‌పోయినా ఎప్ప‌టిలానే ఆశ అయితే లోపల ఉంటుంది క‌నుక మ‌న ఎంపీలు ఏం మాట్లాడినా మ‌న‌కు విన‌ప‌డ‌క‌పోతేనే మేలు. ఎందుకంటే ఇంత‌వ‌ర‌కూ మాట్లాడిన మాట‌లేవీ రాష్ట్రంకు ఉప‌యోగ‌ప‌డ‌లేదు క‌నుక. పాతిక మంది ఎంపీలున్న మ‌న‌కు లోక్ స‌భ‌లో మాట్లాడే శ‌క్తి లేకుండా పోతోంది. కేవ‌లం నాట‌కాలు న‌డిపేందుకు మాత్రం ఎక్కువ స‌మ‌యం వెచ్చిస్తూ అటు టీడీపీ ఇటు వైసీపీ త‌మ ప‌ని తాము కానిచ్చేస్తున్నాయి. తీవ్ర వాన‌లు అటుపై వ‌ర‌ద‌లు ముంచెత్తినా కూడా సంబంధిత న‌ష్టాల అంచనాల్లో త‌రువాత వాటికి సంబంధించి నివేదిక‌ల రూప‌క‌ల్ప‌న‌ల్లో ఎక్క‌డా కేంద్రం చొర‌వ తీసుకోవ‌డం లేదు. అంతేకాదు పంట న‌ష్టాలు అంచ‌నాలు స‌రిగా ఉన్నా కూడా స‌రిగా సాయం చేసిన దాఖ‌లాలే లేవు. ఈ త‌రుణంలో మ‌న ఎంపీలు ఏం మాట్లాడ‌తారు. ఏ విష‌య‌మై చ‌ర్చిస్తారు..? ఒక సారి మ‌నలో మ‌నం అనుకుంటే ...

విభజ‌న చ‌ట్టం అమ‌లుపై మాట్లాడాలి ముందుగా ఎందుకంటే ఇది అమ‌లుకాక చాలా కాలం అయింది క‌నుక! కానీ మ‌న ఎంపీలు ఆ ఊసెత్త‌రు. వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇస్తామ‌న్న కేంద్రం ఆ మాట త‌ప్పింది. ఆ మాట ఎత్తాలి కానీ ఎందుక‌నో ప్ర‌స్తావించ‌రు. ఇవి కాకుండా మ‌న‌కు రైల్వేకు సంబంధించి ప్ర‌త్యేక జోన్ విశాఖ కేంద్రంగా ఇస్తామ‌న్నారు. కానీ ఇప్ప‌టికీ జోన్ ప్ర‌క‌టించక పోగా క‌నీసం స్టేష‌న్ల అభివృద్ధికి నిధులు ఇవ్వ‌క నానా డ్రామాలూ ఆడుతున్నారు. వీటిపై మాట్లాడాలి కానీ మాట్లాడ‌రు. ప్ర‌త్యేక జోన్ లేక‌పోవ‌డంతో ఈ ప్రాంతం రైల్వేల ప‌రంగా సాధించిన అభివృద్ధి శూన్యం. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ ఆపాల‌ని అడ‌గాలి కానీ అడ‌గ‌రు. ఏమీ అడ‌గ‌రు దేనిపై మాట్లాడ‌రు. కేవ‌లం ఎవ‌రి స్వార్థం వారిది. ఎవ‌రి సొంత రాజ‌కీయం వారిది.


మరింత సమాచారం తెలుసుకోండి: