మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారం ప్రభుత్వాన్ని వదిలిపెట్టేలా లేదు. 2019 అసెంబ్లీ శీతాకాల సమావేశాల సమయంలో రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే... పరిపాలన వికేంద్రీకరణ జరగాలని కూడా సూచించారు. అందుకోసమే పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు నగరాన్ని ప్రకటించారు వైఎస్ జగన్. అయితే అలా ప్రకటించిన వెంటనే అమరావతి ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తాయి. రైతులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే దాదాపు 700 రోజులు పైగా నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఇక సేవ్ అమరావతి పేరుతో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర చేపట్టారు రైతులు. ఇదే సమయంలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను వ్యతిరేకిస్తూ... హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై రోజు వారీ విచారణ కూడా ప్రారంభించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. దీంతో చేసేది లేక... మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది వైసీపీ ప్రభుత్వం.

మూడు రాజధానులు, సీఆర్‌డీఏ బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ఇప్పటికే హైకోర్టుకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తెలిపారు. అలాగే శాసనసభ, శాసన మండలిలో కూడా బిల్లు రద్దు చేసినట్లుగా ప్రభుత్వం గత శుక్రవారం మెమో దాఖలు చేసింది. దీనిపై తాజాగా హైకోర్టు త్రి సభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ రాజధాని అమరావతి మాత్రమే అని... మాస్టర్ ప్లాన్ కూడా ఇదే చెబుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. ప్రభుత్వం ఉపసంహరించుకున్న బిల్లులపై గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని గుర్తు చేశారు లాయర్లు. అందువల్ల ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాలని త్రి సభ్య ధర్మాసనాన్ని లాయర్లు కోరారు. అయితే గవర్నర్ వద్దకు పంపామని... ఆయన అనారోగ్యం కారణంగా వాటిపైన నిర్ణయం తీసుకోలేకపోయారని అడ్వకేట్ జనరల్ నివేదించారు. దీంతో గవర్నర్‌ నుంచి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే.... విచారణ కొనసాగింపు నిర్ణయం ఉంటుందని ధర్మాసనం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: