అప్పుల విష‌య‌మై అదేవిధంగా ప్రాజెక్టుల విష‌య‌మై చాలా తీవ్ర స్థాయిలో ఇవాళ కేసీఆర్ విలేక‌రుల స‌మావేశంలో విరుచుకుప‌డ్డారు. కేంద్రం  నుంచి త‌మ‌కు స్ప‌ష్ట‌మ‌యిన హామీ ధాన్యం కొనుగోలుకు రాలేదని తేల్చేశారు. దీంతో తాము అనుకున్న విధంగా యాసంగి ధాన్యం కొనుగోలు పై స్ప‌ష్ట‌మ‌యిన వైఖ‌రి లేక‌పోగా గ‌తంలో త‌మ ద‌గ్గ‌ర తీసుకున్న ధాన్యానికీ పైస‌లు చెల్లించ‌లేద‌ని మండిప‌డ్డారు.

బీజేపీని టార్గెట్ గా చేసుకుని మ‌రో మారు మాట్లాడిన మాట‌లు కేసీఆర్ స్థాయిని  పెంచుతాయో త‌గ్గిస్తాయో కానీ ఎన్నిక‌ల వేడిని అయితే సృష్టిస్తాయి. అంత‌గా ఆయ‌న  ఈ శీత కాలం స‌మ‌యాన మాట్లాడిన మాట‌లు ఉన్నాయి. ఆయ‌న స్థాయిని త‌గ్గిస్తే ఏం చేయ‌లేం కానీ బీజేపీ స్థాయిని పెంచేందుకు ఇవే మాట‌లు ఉప‌యోగ‌ప‌డితే మాత్రం గులాబీ దండుకు కాస్త ఇబ్బందే! కిష‌న్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని ద‌మ్ముంటే కేంద్రంతో  యాసంగి వ‌రి దిగుబ‌డులను కొనుగోలు చేయించాల‌ని చెప్పి మ‌ళ్లీ కేంద్ర మంత్రితో క‌య్యం అందుకున్నారు. ఎవ‌రేం చెప్పినా ఎవ‌రేం ఎన్ని మాట‌లు అన్నా కూడా త‌మ కృషి ఫ‌లితంగానే రాష్ట్రం స‌స్య‌శ్యామలం అయింద‌ని, కానీ ఇవాళ ధాన్యం కొనుగోలు విష‌య‌మై కేంద్రం పెడుతున్న ఇబ్బందులు అదేవిధంగా ఆడిస్తున్న ఆటలు అంత స‌బ‌బుగా లేవ‌న్నది కేసీఆర్ మాట.

మ‌ళ్లీ చాలా రోజుల‌కు కేసీఆర్ మీడియా ముందుకు వ‌చ్చారు. బీజేపీపై నిప్పులు చెరుగుతూ చాలా కీల‌క వ్యాఖ్యలు చేసి ప్ర‌సంగాన్ని ఆద్యంతం ఆస‌క్తిదాయ‌కంగా మ‌లిచారు. ఎన్న‌డూ లేనిది కేంద్రాన్ని ఓ అన‌రాని మాట కూడా అన్నారు. దీంతో బీజేపీ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి. లైవ్ వెళ్లిన వెంటనే ఓ సీఎం ఈ స్థాయి భాష ఏ విధంగా ఉప‌యోగిస్తార‌ని మండిప‌డుతున్నారు క‌మ‌ల నాథులు. దేశాన్ని బీజేపీ భ్రష్టు ప‌ట్టించింద‌ని చెప్పారు. అదేవిధంగా ఎనభై వేల కోట్ల రూపాయ‌లు అప్పు తెచ్చి రుణ భార‌తాన్ని పెంచార‌ని, ఊహించ‌ని స్థాయిలో తెచ్చిన అప్పులు ఫ‌లితంగా రేపటి వేళ ఏ విధంగా ఉంటుందో అన్న ఆందోళ‌న‌లో తానున్నాన‌న్న అర్థంలో ఆయ‌న మాట్లాడారు. అదేవిధంగా మ‌త పిచ్చి రేగొట్ట‌డంలోనూ, క‌ల‌హాలు సృష్టించ‌డంలోనూ బీజేపీ దే పై చేయి అన్న విధంగా కూడా మాట్లాడి మ‌రో సంచ‌ల‌నం అయ్యారు. మ‌త పిచ్చి రేగొట్ట‌డం ద్వారా రాష్ట్రాన్ని బీజేపీ రావ‌ణ కాష్టం చేస్తోంద‌ని మండి ప‌డ్డారు కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: