అసెంబ్లీలో కన్నీరు పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు, రాజకీయ ప్రత్యర్థిపై పగ తీర్చుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వరద బాధితులను స్వయంగా కలిసి, పరామర్శించారు. ఆపద సమయంలో అధికార వైసీపీ విఫలమైందంటూ విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉండగా వరద బాధితులకు ఎలా అండగా ఉండేదో చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా వైసీపీపై మరో అస్త్రాన్ని సంధించారు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీతో గతంలో నిర్మించుకున్న ఇళ్లకు ఇటీవల వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో కొంత రుసుము వసూలు చేసి పర్మినెంట్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అయితే ఆ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, టీడీపీ అధికారంలోకి వస్తే తామే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని అంటున్నారు చంద్రబాబు.

వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పేదల నుంచి 10 నుంచి 15 వేల రూపాయల వరకూ దోచుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు చంద్రబాబు. పేదలెవరూ డబ్బు కట్టొద్దని.. తమ ప్రభుత్వం రాగానే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పుకొచ్చారు. వైసీపీకి సహకరించొద్దని విజ్ఞప్తి చేశారు. ఓటీఎస్ పధకం పేరుతో దాదాపుగా 15 వేల కోట్ల రూపాయలను పేదల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. అసలు ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు ఓటీఎస్ ఫీజు కట్టాల్సిన అవసరమే లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే చంద్రబాబు ప్రకటనకు ఫలితం ఉంటుందా.. వైసీపీ ఈ నిర్ణయంపై వెనక్కు తగ్గుతుందా అనేది వేచి చూడాలి.

ఆర్ధికంగా కష్టాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఇలా ఓటీఎస్ పేరుతో వసూళ్లు ప్రారంభించిందని ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా విమర్శలు మొదలుపెట్టాయి. చంద్రబాబు కూడా ఈ విషయంపై గట్టిగానే పోరాడాలని చూస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే పోరాటానికి కూడా సిద్దమవ్వాలని కార్యకర్తలకు సూచించారని సమాచారం. తాజాగా జరిగిన టీడీపీ వ్యూహకర్తల సమావేశంలోనూ చంద్రబాబు ఈ విషయంపై చర్చ జరిపినట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై ఇకపై ఉపేక్షించేది లేదని.. నేరుగా పోరాడాలని చెప్పినట్టుగా సమాచారం. ఇప్పటికే ఆ దిశగా టీడీపీ నేతలు వరుస ప్రెస్ మీట్లతో ఈ ఓటీఎస్ పై విమర్శలు చేయడం కూడా ప్రారంభించారు. మరి ఓటీఎస్ విషయంలో చంద్రబాబు మాటల్ని జనం నమ్ముతారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: