తెలుగుదేశం పార్టీ ఫీనిక్స్ ప‌క్షిలా పైకి లేస్తుందా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని వెన‌క్కి నెట్టి ముంద‌డుగు వేస్తుందా? ఇంకా రెండున్న‌రేళ్లు అధికార పార్టీ అవ‌మానాల‌కు ఎదురొడ్డి పార్టీని గెలుపు బాట‌లో తీసుకెళ‌తారా ? ఎన్నిక‌ల‌కు ఒంట‌రిగా వెళ‌తారా.. పొత్తులు ఉంటాయా.. అని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.

ఎదురుదెబ్బ‌లు కొత్త కాదు..!
టీడీపీకి ఎదురుదెబ్బ‌లు కొత్తేం కాదు. పార్టీ ప్రారంభం నుంచి ఇలాంటి ముళ్ల‌దారుల్ని ఎన్నో దాటుకొని వ‌స్తోంది. నా అనుకున్న వాళ్లు, ఒక‌టి రెండు స్థానాలు అనుకున్న వాళ్లు ఎంద‌రో పార్టీకి వెన్నుపోటు పొడిచి వేరు దారులు వెతుక్కున్నారు. అయినా పార్టీ కుంగిపోలేదు. చంద్ర‌బాబు పోరాట‌ప‌టిమ‌తో పార్టీ శ్రేణుల్లో మ‌నోధైర్యం క‌ల్పిస్తూ వ‌స్తున్నారు.

1983 నుంచి మొద‌లుకొని..
నంద‌మూరి తార‌క‌రామారావు 1983లో టీడీపీని స్థాపించిన ద‌గ్గ‌ర‌నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ ఎన్నో ఎత్తుప‌ల్లాలు చూసింది. ఎంద‌రో ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు అందుకుంది. 1983లో పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నాదెండ్ల భాస్క‌ర‌రావు మోసం చేస్తే ఆ వెంట‌నే ప్ర‌జ‌లు త‌మ తీర్పును ఓట్ల రూపంలో తెలియ‌జేశారు. 1989లో ఓడిపోయినా 94లో విజ‌యం సాధించింది.  1999లో కూడా తిరిగి త‌మ అధికారాన్ని నిలుపుకుంది. 2004, 09లో వైఎస్ ప్ర‌భ‌జ‌నంలో ప‌రాజ‌యం చ‌విచూసింది. 2014లో విభ‌జిత న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబు మార్కు విజ‌న్‌తో తిరిగి గ‌ద్దెనెక్కింది. 2019లో వైసీపీ చేతిలో ఓడిపోయింది.

ఈసారి లెక్క ప‌క్కా..!
ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను ఈసారి క్యాష్ చేసుకోవాల‌ని.. వంద‌కు పైగా స్థానాల్లో గెలిచి తీరాల‌ని టీడీపీ శ‌ప‌థం చేసుకుంది. త‌మ బ‌లం ఎక్కువ‌గా ఉన్న కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశం, తూర్పు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో త‌మ మెజారిటీని కొన‌సాగించాల‌ని.. ఉత్త‌రాంధ్ర, రాయ‌ల‌సీమ‌ జిల్లాల్లో గ‌రిష్ఠ సీట్లు సాధించాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది. దీని కోసం పార్టీ శ్రేణుల‌ను ఇప్ప‌టి నుంచే నియోజ‌క‌వ‌ర్గాల్లో మోహ‌రిస్తోంది.  సీనియ‌ర్ నేత‌ల‌కు ల‌క్ష్యాలు నిర్దేశిస్తోంది.

పొత్తులు ఉంటాయా...?
టీడీపీ అధికార ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు తీవ్రంగానే శ్ర‌మిస్తోంది. ఈసారి ఎలాగైనా వైసీపీని ఓడించి అవ‌మానాల‌ పాల‌నకు ముగింపు ప‌ల‌కాల‌ని భావిస్తోంది. అందుకు త‌మ శ‌క్తి చాల‌క‌పోతే ఇత‌ర శ‌క్తుల సాయం తీసుకునేందుకైనా వెన‌కాడ‌డం లేదు. అందుకు గ‌తంలో మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన పార్టీతో చెట్టాప‌ట్టాలు వేసుకోవాల‌ని భావిస్తోంది. ఆ పార్టీతో పొత్తుల సంప్ర‌దింపుల‌ను ముందుకు తీసుకెళ్లాల‌ని యోచిస్తోంది. వచ్చే 2024  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఆశ‌లు ఏమేర‌కు నెర‌వేరుతాయో? ఎవ‌రెవ‌రితో పొత్తులు పెట్టుకుంటుందో వేచి చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: