తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో మాజీ మంత్రితో హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ రెడ్డి ట‌చ్‌లోనే ఉన్నారా..?  వీరిద్ద‌రి మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందం జ‌రిగిందా..? త‌మ ఉమ్మ‌డి శ‌త్రువు సీఎం కేసీఆర్‌కు షాక్ ఇచ్చేందుకు ఇద్దరూ నేత‌లు స్కెచ్ వేస్తున్నారంటే  రాజ‌కీయాల వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన‌ హుజూరాబాద్ ఉపఎన్నిక‌లో ఇచ్చిన ఝ‌ల‌క్ మాదిరిగానే గులాబీ బాస్‌కు మ‌రొక‌సారి దిమ్మ‌తిరిగేవిధంగా షాక్ ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌లు ప‌థ‌కం ప‌న్నార‌ని పేర్కొంటున్నారు. బ‌ద్ద వ్య‌తిరేక పార్టీలు అయిన కాంగ్రెస్‌, బీజేపీలు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ టార్గెట్‌గా క‌లిసి పోవ‌డ‌మే తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన‌ది.

ఇదే వ్యూహంతో తెలంగాణ రాజ‌కీయాల‌లోనే ఎంతో కాక రాజేసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో సంచ‌ల‌న విజ‌యం సాధించి అధికార టీఆర్ఎస్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్  ఇచ్చారు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌. త‌న‌కు హుజూరాబాద్‌లో ఎదురు లేద‌ని భావించే సీఎం కేసీఆర్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టారు. ముఖ్యంగా హుజూరాబాద్ ఫ‌లితాన్ని కేసీఆర్ ఇంకా జీర్ణించుకోలేక పోతున్నార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపిన‌ది. ఈట‌ల రాజేంద‌ర్ గెలుపు కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సాయం చేసార‌ని కొంద‌రూ నేత‌లు హై క‌మాండ్‌కు కూడా ఫిర్యాదు చేసారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల్లో జ‌రిగిన కాంగ్రెస్ పంచాయితీ ఢిల్లీ వ‌ర‌కు వెళ్లింది.  అదేవిధంగా ఏఐసీసీ వార్  రూమ్ స‌మావేశంలో కూడా పీసీసీ నేతల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న‌దని ప్ర‌చారం జ‌రిగింది.

హుజూరాబాద్ మంట‌లు కాంగ్రెస్‌లో అలా ఉండ‌గానే తాజాగా మ‌రో ప్ర‌చారం సాగుతున్న‌ది. స్థానిక సంస్థ‌ల కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఈట‌ల రాజేంద‌ర్‌తో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ర‌హ‌స్య ఒప్పందం చేసుకున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు ఎలాగైనా షాక్ ఇవ్వాల‌ని ఈట‌ల రాజేంద‌ర్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు కాంగ్రెస్ సాయం చేస్తుంద‌ని పేర్కొంటున్నారు. క‌రీంన‌గ‌ర్‌లో ఈట‌ల రాజేంద‌ర్ మ‌ద్ద‌తుతో మాజీ మేయ‌ర్ ర‌వీంద‌ర్ సింగ్ ఎమ్మెల్సీ బ‌రిలో నిల‌బ‌డ‌డంతో ఆయ‌న గెలుపు కోసం ఈట‌ల తీవ్రంగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎలాగైనా ర‌వీంద‌ర్ సింగ్‌ను గెలిపించుకొని టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాల‌ని ఈట‌ల చూస్తున్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకు రేవంత్‌రెడ్డి కూడా సై అన్నార‌నే ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్ సూచ‌న మేర‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డిని కూడా క‌లిసి ర‌వీంద‌ర్ సింగ్ మ‌ద్ద‌తు కోరార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.  

ముఖ్యంగా తెలంగాణ‌లోని 9 జిల్లాల ప‌రిధిలోని 12 స్థానాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతో నాలుగు జిల్లాల ప‌రిధిలో 6 స్థానాలు ఇప్ప‌టికే ఏక‌గ్రీవం అయ్యాయి. మిగిలిన క‌రీంన‌గ‌ర్ 2, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, మెద‌క్‌, ఆదిలాబాద్‌లో ఒక్కొక్క స్థానానికి పోలింగ్ జ‌రుగ‌నున్న‌ది. కాంగ్రెస్‌కు ఖ‌మ్మం, మెద‌క్ జిల్లాల్లో అభ్య‌ర్థులున్నార‌ని, మిగిలిన నాలుగు చోట్ల స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని యోచిస్తున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఆదిలాబాద్‌లో ఆదివాసీ ప్రాంత నేత‌గా బ‌రిలో దిగిన పుష్పారాణికి అధికారికంగానే కాంగ్రెస్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న‌ది. ఇక్క‌డ బీజేపీ కూడా పుష్పారాణికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. న‌ల్గొండ నుంచి బ‌రిలో ఉన్న ఆరుగురు స్వ‌తంత్ర అభ్య‌ర్థుల్లో ఇద్ద‌రు కాంగ్రెస్ జ‌డ్‌పీటీసీలే కావ‌డం గ‌మ‌నించ‌ద‌గిన విష‌యం. అక్క‌డ నిర్ణ‌యాన్ని ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి వ‌దిలేసారు. ఒక‌టి రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను ఓడించాల‌నే ల‌క్ష్యంతో కాంగ్రెస్‌, బీజేపీల నేత‌లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. మొత్తానికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందం చేసుకుని టీఆర్ఎస్ ఓడించేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.  ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో క‌రీంన‌గ‌ర్‌, ఆదిలాబాద్ స్థానాల‌లో ఎవ‌రూ గెలుస్తారో ప‌లితాల వ‌ర‌కు  వేచి చూడాలి మ‌రి.




 



మరింత సమాచారం తెలుసుకోండి: