రెండంటే రెండు ఉంటాయి ఒకటి వ్య‌క్తం కానుక
అవ్య‌క్తం సిరి.. లేదా వ్య‌క్తం వెన్నెల అవ్య‌క్తం ఆనందం
కావొచ్చు.. ఆనంద సిరులు తీసుకువ‌చ్చిన వెన్నెల అత‌డు
శివుడు అత‌డు..శివుడే మెచ్చిన మంచి క‌వి అత‌డు
మీరు వెళ్లిపోవ‌డం అన్న మాట‌లో అర్థం లేదు
అవ‌న్నీ అజ్ఞానులు ప‌లుకుతారు.. క‌వికి లోకంలో చిర స్థానం అని ఒక‌టి ఉంటుంది.. అక్క‌డ మీరు ఉంటారు.. వెరీ గుడ్ బోయ్ క‌దా! మీరు.. అలానే మీ స్ధానం ను ప‌దిలం చేసుకుని పాట‌కు కొత్త ల‌య‌ను ఇవ్వండి..శ్రుతి ఇవ్వండి..గ‌మ‌నం త‌ప్పిన వేళ నాలుగు తిట్టి చెప్పండి.. మీరు! వింటున్నారా! వెన్నెల క‌వీ! మిమ్మ‌ల్ని వ్య‌క్తంలో ఇమిడ్చి ఉంచ‌ను. అవ్య‌క్త అనుభూతిని పొందే వేళ ఈ కుర్రాడి పాట లేదా ఆ వెర్రి గాలి ఊళ  రెండూ ఒక్క‌టే స‌ర్!


పాట రాసి వెళ్లిపోవ‌డంలో బాధ్య‌త ఉందా స‌ర్.. పాట రాయకుండా ఉండ‌డంలోనూ బాధ్య‌త ఉంది క‌దా! అవును! త‌ప్పు ప‌దాలు ప్ర‌యోగ దోషాలు త‌త్ సంబంధిత వ్యాక‌ర‌ణ రీతులు ఇవ‌న్నీ చెడిపోయిన సంస్కృతికి అద్దం ప‌డ‌తాయి. సంస్కృతి ఎలా ఉన్నా నిర్మాణం చెడిపోకూడ‌దు.. లోప‌లి నిర్మాణం అని రాయాలి నేను.. బ‌య‌ట సంస్కృతి ఎలా ఉన్నా లోప‌లి నిర్మాణం అంతా శివేచ్ఛ.. కార్తీకాన కైవ‌ల్య సిద్ధి పొందడం కూడా శివేచ్ఛనే! ఇప్పుడిక నేనేం రాసినా మాట్లాడినా అవన్నీ క‌వ‌న సౌంద‌ర్యం అయి ఉండాలి. కవితాత్మ‌కం నివాళి కాదు..నివాళి ల‌క్ష‌ణం అది కాదు. అది ధిక్కారాన్ని పొగ‌డాలి.. స‌మాజ రీతి త‌ప్పు ఉంటే అస‌హ్యించుకుని పోవాలి. తూరుపు క‌వి కొన్ని మంచి పాట‌ల‌కు కొన్ని అర్థాలు తాన‌య్యాడు.. ఇంటి పేరు చెంబోలు.. ఊరు అన‌కాప‌ల్లి.. ఇంట‌ర్ అయ్యాక మెడిస‌న్ ఎంట్ర‌న్స్ లో టాప‌ర్ ఆయ‌న. ఇంటి భారం నెత్తిన పెట్టుకున్న శివుడు.. అందుకే టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో చేరిపోయాడు..

"నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా
కాసేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా
కిట కిట త‌లుపులు తెరిచిన మ‌న‌సుకు సూర్యోద‌యం ...
అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం.."

ఇది మీరు రాసిందే నేను పాడుకుంటున్నాను. సూర్యోద‌యాల వేళ ఇంత‌టి వ‌ర్ఛ‌స్సు ఉంటుంది.. స్వ‌ప్నం ఎలా ఉంటుంది స‌త్యం ఏమ‌యి ఉంటుంది అని తేడా ఒక‌టి వేళాపాళా లేకుండానే తెలియాలి. వేళ‌ల ప‌ట్టింపు క‌వికి ఉండ‌కూడదు.. క‌వి స‌మ‌యం అని అంటారే కానీ అది త‌గ‌ని మాట.. మీరు ఎప్పుడు మాట్లాడినా మాతో పోట్లాడినా అదంతా క‌వి స‌మ‌య‌మే క‌దండి.. మ‌ళ్లీ వేరుగా మిమ్మల్ని  కాలాన్ని వేరు చేసి మాట్లాడ‌తారేంటి?

నివేదిస్తూ నివాళిస్తూ
ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి అనే మ‌రో తూరుపు క‌వి


మరింత సమాచారం తెలుసుకోండి: