తెలంగాణ ఆర్టీసీ సంస్థ వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. సంస్థలో కీలక మార్పులు చేశారు. ఈ నెలలోనే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు సజ్జనార్ ప్రకటించారు కూడా. ఒకరోజులో 75 శాతం ఆక్యుపెన్సీ సాధించినట్లు వెల్లడించారు సజ్జనార్. తెలంగాణ ఆర్టీసీని లాభాల పట్టించేందుకు సజ్జనార్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే తాజాగా సజ్జనార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం హైదరాబాద్ సిటీలో డిపోల సంఖ్య తగ్గిస్తున్నారనే వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. దీంతో ఇప్పుడు కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు డిపోలను తగ్గించాల్సిన అవసరం ఏమోచ్చింది అంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు కూడా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న డిపోల సంఖ్యను తగ్గించాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం సిటీలో తిరిగే బస్సులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

ప్రస్తుతం హైదారాబాద్ సిటీలో మెట్రో రవాణా జోరుగా సాగుతోంది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రజలు మెట్రో ప్రయాణంపై మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సిటీలోని 9 డిపోలను మూసి వేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. నిర్వహణా ఖర్చులు తగ్గించుకునేందుకు డిపోలను తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా డిపోల్లో పనిచేస్తున్న సిబ్బందిని కూడా ఇతర డీపోలకు బదిలీ చేస్తున్నారు. ఇప్పటికే పికెట్, బీహెచ్ఈఎల్, హైదరాబాద్-3 డిపోల్లో ఉన్న బస్సులను ఇతర డీపోలకు కేటాయించారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని డిపోలు పీకల్లోతు నష్టాల్లో ఉన్నాయి. దీంతో డిపోల సంఖ్యను 29 నుంచి 20కి తగ్గించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంటోంది ఆర్టీసీ యాజమాన్యం. ఉద్యోగుల సమ్మె, కరోనా వైరస్ లాక్ డౌన్, మెట్రో రైలు అందుబాటులోకి రావడం వంటి పరిణామాల వల్ల  ఆర్టీసీ సంస్థపై పెను ప్రభావం పడింది. ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో ఆయా డిపోల స్థలాలను లీజుకు ఇచ్చేందుకు యజామాన్యం సిద్ధమైంది. దీని ద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: