సి‌బి‌ఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదనే చెప్పొచ్చు. జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో ఎలా హైలైట్ అయ్యారో అందరికీ తెలుసు. అలా హైలైట్ అయిన జేడీ..ఉద్యోగాన్ని వదిలేసి మరీ రాజకీయాల్లోకి వచ్చిన విషయం కూడా తెలిసిందే. గత ఎన్నికల ముందు జేడీ పోలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈయన బీజేపీ లేదా టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన అనూహ్యంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరారు.

అలా జనసేనలో చేరిన జేడీ..2019 ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా బరిలో దిగారు. అయితే ఆ ఎన్నికల్లో జేడీ ఓడిపోయినా సరే...ఓట్లు మాత్రం బాగే తెచ్చుకున్నారు. విశాఖ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు ఎక్కువ ఓట్లు రాకపోయినా సరే...జేడీ విశాఖ పార్లమెంట్ స్థానంలో దాదాపు రెండు లక్షల 88 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఇన్ని ఓట్లు పడటానికి కారణం జేడీ సొంత ఇమేజ్. పవన్ ఇమేజ్ ఉన్నా సరే...జేడీని చూసి చాలామంది ఓట్లు వేశారు.

చదువుకున్నవారు, ఉద్యోగులు జేడీ వైపు మొగ్గు చూపడం వల్ల అన్నీ ఓట్లు పడ్డాయి. ఇలా జేడీ ఓట్లు చీల్చేయడం వల్లే విశాఖలో టీడీపీ తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఎన్నికలయ్యాక జేడీ కొన్నిరోజులు జనసేనలోనే పనిచేశారు. కానీ అనూహ్యంగా ఆయన జనసేనకు రాజీనామా చేసి బయటకొచ్చేశారు.

ప్రస్తుతానికి ఇండిపెండెంట్‌గా, సామాజిక కార్యకర్తగా రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఇలాగే నెక్స్ట్ ఎన్నికల బరిలో దిగితే జేడీ గెలవడం జరగదు. కాబట్టి మళ్ళీ ఈయన జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మళ్ళీ జనసేనలో చేరి విశాఖ బరిలో నిలబడటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ సారి టీడీపీతో పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇక పొత్తు ఉంటే మాత్రం విశాఖ బరిలో జేడీ గెలుపు సులువు అవుతుంది. చూడాలి మరి నెక్స్ట్ జేడీ రాజకీయం ఎలా ఉంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: