కంగనా రనౌత్... బాలీవుడ్ స్టార్ హీరోయిన్... అంతకు మించి వివాదాలకు కేంద్ర బిందువు. 2020లో హీరో సుశాంత్ రాజ్‌ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న కంగనా... ఒక్కసారిగా భగ్గుమన్నారు. అసలు ఈ డ్రగ్స్ దందాకు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా అగాఢీ ప్రభుత్వ పెద్దలే కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కూడా వ్యవహరించారు. డ్రగ్స్ మాఫీయా వెనుక మహారాష్ట్ర ప్రభుత్వంలోని కీలక నేతలు ఉన్నారని కూడా ఆరోపించారు. దీనిపై లోతైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో నిలుస్తున్న కంగనాకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారం కూడా అందించింది. ఆ తెల్లారే కంగానా రనౌత్ చేసిన కామెంట్లు... దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. దేశానికి నిజమైన స్వాతంత్ర్యం 2014లోనే వచ్చిందంటూ కంగానా కామెంట్ చేసింది.

కంగనా వ్యాఖ్యలపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి బీజేపీ ఎంపీలు, నేతలు కూడా కంగానా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇప్పుడు తాజాగా కంగనాపై సుప్రీంకోర్టులో పిటిషన్  దాఖలైంది. సోషల్ మీడియా వేదికగా కంగానా చేస్తున్న పోస్టులు, కామెంట్లపై తప్పనిసరిగా నియంత్రణ ఉండాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కంగాన వ్యాఖ్యల వల్ల దేశంలో అశాంతియుత వాతావరణం చోటు చేసుకుంటుందని.... పలు చోట్ల ఘర్షణలకు కూడా కారణమవుతున్నాయని సుప్రీం కోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకువచ్చారు. సున్నితమైన అంశాలపై కంగనా చేస్తున్న వ్యాఖ్యలను తప్పనిసరిగా నియంత్రిచాల్సిన అవసరం కూడా ఉందని పిటిషన్‌లో ప్రస్తావించారు. జాతి పిత మహాత్మగాంధీ సహా స్వాతంత్ర్య సమరయోధులను కంగనా అవమానించారంటూ... ఆమెపై చర్యలు తీసుకోవాలని కూడా పిటిషనర్‌లు అభిప్రాయపడ్డారు.  కంగనా రనౌత్ అధికారిక అకౌంట్‌ను ఇప్పటికే ట్విట్టర్ సంస్థ బ్యాన్ చేసిన విషయాన్ని కూడా పిటిషనర్‌లు ప్రస్తావించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: