ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలపైనే ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో వేల కోట్ల రూపాయలను అందించారు. తొలి ఏడాదిలోనే దాదాపు 90 శాతం హామీలును అమలు చేశామని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. కానీ క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది కూడా రాష్ట్రం. ప్రస్తుతం రాష్ట్ర ఖజనా ఖాళీగా ఉంది. చివరికి ఉద్యోగుల జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితి. ఇక అప్పుల జాబితా కూడా పెరిగిపోయింది. అలాగే రుణ పరిమితి పెంచాలని కేంద్రానికి వరుస లేఖలు రాశారు కూడా ఆర్థిక శాఖ అధికారులు. అయితే రాష్ట్ర ఆర్థిక విధానాన్ని తప్పుబడుతూ విపక్షాలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నాయి. కేంద్రానికి లేఖలు కూడా రాశారు విపక్ష నేతలు.

ఇప్పుడు తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర అప్పుల వ్యవహారాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావన చేశారు. ప్రభుత్వం విచ్చల విడిగా చేస్తున్న అప్పులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్లమెంట్‌లో ప్రస్తావించారు. కేంద్రం రాష్ట్రాలకు విధిస్తున్న అప్పులు తీసుకున్న ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని ఏపీలోని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు రఘురామ. ఏపీలో ఆర్టికల్ 293 ఉల్లంఘన జరుగుతోందని కూడా ఆర్ఆర్ఆర్ ఆరోపించారు. ఇప్పటికే ఏపీ అప్పులు 7 లక్షల కోట్లకు చేరాయని... ఇప్పుడు మరో లక్ష కోట్లు అప్పులు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని రఘురామ లోక్‌సభలో ప్రస్తావించారు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితి ఉల్లంఘించడంపై కేంద్రం తక్షణమే దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు రఘురామ కృష్ణంరాజు.

మరింత సమాచారం తెలుసుకోండి: