చంద్రబాబు రాజకీయ వ్యూహాలు మారుతున్నాయి. ఇప్పటిదాకా   ఏపీని వివిధ అంశాల మీద హీటెక్కించిన టీడీపీ ఇపుడు గేరు మార్చబోతోంది. అంతే కాదు, మరో మారు జగన్ని ఇరకాటంలో పెట్టే మాస్టర్ ప్లాన్ కి రెడీ అవుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వైసీపీకి భారీ షాక్ ఇవ్వడానికి కూడా సిద్ధం అంటున్నారు.

ఇంతకీ టీడీపీ స్కెచ్ ఏంటి, చంద్రబాబు వ్యూహాలు ఏంటి అన్నది కనుక చూస్తే బాబు మరో సారి ఢిల్లీ గడప ఎక్కబోతున్నారు. అవును, చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళేందుకు సర్వం సిధ్ధం చేసుకుంటున్నారు. గత నెలలో ఢిల్లీ వెళ్ళి కేవలం రాష్ట్రపతిని మాత్రమే కలసి వచ్చిన చంద్రబాబు ఈసారి మాత్రం పక్కా ప్లానింగ్ తోనే ఢిల్లీ టూర్ కి ప్రిపేర్ అయ్యారని టాక్.

ఈసారి ఢిల్లీ వెళ్తే కచ్చితంగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలసి వస్తారని అంటున్నారు. అదే కనుక జరిగితే అంత కంటే హాట్ టాపిక్ ఏదీ ఉండదు, చంద్రబాబు మోడీ షాలతో కలసింది చివరిగా మూడేళ్ళ క్రితం కావచ్చు. ఆయన 2018 మార్చిలో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేశారు. ఆ తరువాత ఆయన వారిని కలిసింది లేదు.

అయితే రాజకీయాలు ఎపుడూ ఒకేలా ఉండవు కాబట్టి బాబు ఢిల్లీ టూర్ ఆసక్తిని కలిగిస్తోంది. ఏపీలో వైసీపీని కార్నర్ చేయాలీ అంటే బీజేపీ మద్దతు అవసరం అని బాబు భావిస్తున్నారు. అందుకే ఆయన వారితో స్నేహం చేయడానికి చూస్తున్నారు. ఈ మధ్య తిరుపతి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయితే అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. దాంతో పాటుగా టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన ఎంపీలు, ఇతర నాయకులకు విలువ ఇస్తున్నారు. ఈ పరిణామాలను చూసుకుంటే కనుక బాబు ఢిల్లీ టూర్ లో అనూహ్య కలయికలే ఉంటాయని అంటున్నారు. మరి అదే జరిగితే వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది చర్చగా ఉంది మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: