ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఒకటే చర్చ... రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నారు అనేదే. అసలు మంత్రిగారు ఉన్నారా... లేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణంగా... దాదాపు 20 రోజులుగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎ్కడా కనిపించడం లేదు. చివరికి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన దర్శనం కలగలేదు. ఓ వైపు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలతో పాటు మంత్రి సొంత జిల్లా నెల్లూరు కూడా వరద ముంపులో చిక్కుకుంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రికార్డు స్థాయి వరదలతో కడప జిల్లాలోని అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు తెగిపోయాయి. ఊళ్లకు ఊళ్లు నీటి మునిగాయి. కాలువలు తెగిపోయాయి. చెరువుల కట్టలు బలహీనంగా మారిపోయాయి. భారీ వరదకు నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారి సైతం కొట్టుకుపోయింది.

ఇంత విపత్తు జరిగినా సరే... సంబంధిత జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల సమయంలో విస్తృతంగా పర్యటించారు అనిల్. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా కూడా మంత్రి అనిల్ మాత్రం... నెల్లూరు నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థపై వైసీపీ జెండా ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం అనిల్ దర్శనాలు లేకుండా పోయాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులు నీటితో పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు వరద నీటితో తెగిపోతున్నాయి. కానీ మంత్రిగారు కనిపించడం లేదు. మరో వైపు ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించిన సమయంలో కూడా మంత్రి అనిల్ లేరు. ఇప్పుడు నెల్లూరు జిల్లాను మరోసారి వరద భయం పట్టి పీడిస్తోంది. జిల్లా అధికారులతో కూడా మంత్రి సమీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు.


మరింత సమాచారం తెలుసుకోండి: