ఏపీ సీఎం జగన్‌కు ప్రశంసలు దక్కాయి.. సంక్షేమం విషయంలో జగన్ సర్కారు సూపర్ అన్న మెచ్చుకోళ్లు వచ్చాయి. ప్రత్యేకించి దిశ చట్టం.. దిశ యాప్ బావుందని.. దీన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలుచేయమని చెబుతామని మెచ్చుకుంటున్నారు. ఈ మెచ్చుకోళ్లు అన్నీ ఎవరి నుంచి అంటారా.. రాష్ట్రానికి వచ్చిన నీతి ఆయోగ్ బృందం జగన్‌తో సమావేశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి పరిశీలించింది. ఆ తర్వాత అన్నీ బాగున్నాయని మెచ్చుకుంది.


జగన్ సర్కారు రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తున్న విధానం బావుందని నీతి ఆయోగ్ బృందం ప్రశంసించింది. అలాగే దిశ యాప్‌ బాగుందని ప్రశంసించింది. కొవిడ్‌తో అనాథలైన పిల్లలకు 10 లక్షలు డిపాజిట్‌ చేసే విధానం కూడా బావుందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. దిశ యాప్‌ను అమలు చేయాలని ఇతర రాష్ట్రాలకు సూచిస్తామని నీతి ఆయోగ్ బృందం చెప్పింది. రెండు రోజుల పర్యటన కోసం ఏపీ వచ్చిన నీతిఆయోగ్ బృందం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమైంది.


ఏపీ  హైదరాబాద్‌ నగరాన్ని కోల్పోవడం వల్ల ఆదాయం తగ్గిన విషయం తమకు తెలుసన్న  నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ రాజీవ్ కుమార్ ఆర్థికలోటు పూడ్చడానికి సహకారం అందిస్తామన్నారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బావున్నాయని  రాజీవ్‌కుమార్‌ అభినందించారు. ఇదే సమయంలో ఏపీకి రాజీవ్ కుమార్ కొన్ని సూచనలు కూడా చేశారు. ఏపీకి ఎక్కువగా ఉన్న తీరప్రాంతాన్ని బాగా వినియోగించుకోవాలని.. అక్కడ ఆర్థిక, పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తీర ప్రాంతంలో పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని రాజీవ్ కుమార్ సూచించారు.


ఏపీలో అమలు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలను మెచ్చుకున్న రాజీవ్ కుమార్.. వీటి ద్వారా  సేంద్రియ పంటల ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ ఉత్పత్తుల ద్వారా  రైతులకు మంచి ఆదాయం వస్తుందన్నారు. అంగన్‌వాడీలతో పాటు పాఠశాలలను ఆరు అంచెలుగా విభజించిన విషయం గురించి తెలుసుకున్న రాజ్‌ కుమార్ అభినందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: