సౌతాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 20దేశాలకు విస్తరించింది. ఈ వేరియంట్ తక్కువ సమయంలోనే మరిన్ని దేశాలకు పాకుతున్నట్టు తెలుస్తోంది. వేగంగా విస్తరిస్తున్న ఈ వేరియంట్ వల్ల రానున్న రోజుల్లో కేసుల సంఖ్య భారీగా పెరగచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఇది చాలా భిన్నంగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇక ఈ వేరియంట్ వ్యాప్తి, తీవ్రతపై పరిశోధన కొనసాగుతోంది.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా.. ప్రపంచ వ్యాప్తంగా దేశాలు విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఒమిక్రాన్ వేరియంట్ మనల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని.. ట్రావెల్ బ్యాన్ లతో దీని వ్యాప్తిని నిరోధించలేమని అన్నారు. ఇలా చేస్తే.. ప్రజల జీవనోపాధి, దేశాల ఆర్ధిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఇతర మార్గలు చూడాలన్నారు.

ఇక కొవిషీల్డ్ టీకాను బూస్టర్ డోస్ గా అందించేందుకు అనుమతులు ఇవ్వాలని డీసీజీఐకు సీరం ఇన్ స్టిట్యూట్ దరఖాస్తు చేసుకుంది. ఒమిక్రాన్ భయాందోళనల కారణంగా కొవిషీల్డ్ ను బూస్టర్ డోసుగా ఉపయోగించాలని అభ్యర్థించింది. దేశంలో సరిపడా కొవిషీల్డ్ నిల్వలు ఉన్నాయని వివరించింది. అయితే బ్రిటన్ లో కొవిషీల్డ్ ను బూస్టర్ డోసుగా వినియోగించేందుకు యుకె ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు జారీ చేసింది.

ప్రస్తుతం ఉన్న టీకాలు.. ఒమిక్రాన్ సోకిన వారిని తీవ్రమైన వ్యాధి లక్షణాల నుంచి కాపాడే అవకాశం ఉందని బయో ఎన్ టెక్ ఫార్మా సంస్థ సీీఈఓ సాహిన్ అంటున్నారు. మ్యూటేషన్ల కారణంగా టీకా తీసుకున్న వారికి కూడా ఒమిక్రాన్ సోకే అవకాశముందన్నారు. అయితే టీకాల వల్ల వచ్చిన రోగనిరోధకత వైరస్ తీవ్రతను అడ్డుకుంటుందని చెప్పారు. వైరస్ వల్ల చనిపోయే అవకాశాన్ని తగ్గిస్తుందని వివరించారు.

మరోవైపు ఆఫ్రికా దేశాల నుంచి భారత్ కు వచ్చిన చాలా మంది ఆచూకీ దొరకడం లేదు. పాస్ పోర్టుల్లో ఉన్న అడ్రసుల్లో వారు ఉండటం లేదు. దీంతో స్థానికంగా కొత్త వేరియంట్ వ్యాపించే అవకాశముందని అధికారులు అంటున్నారు. గత 15రోజుల్లో ఆఫ్రికా దేశాల నుంచి ముంబైకు 1000మంది రాగా.. వీరిలో 466మందిని మాత్రమే గుర్తించారు. బీహార్ లోనూ 100మంది కనిపించకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: