ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా సరే... అదో సెన్సేషన్ అవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రివర్స్ టెండరింగ్, సంక్షేమ పథకాల అమలు, వాలంటీర్ వ్యవస్థ, గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన... ఇలా ఎన్నో నిర్ణయాలు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అదే జోరు మీదున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ప్రతిపక్షాలకు ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా చూసుకుంటోంది. అదే సమయంలో ప్రతిపక్షాలను ఆర్థికంగా దెబ్బ తీసేందుకు కూడా ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను అడ్డుకునేందుకు సినిమా టికెట్ల వ్యవహారం తెరపైకి తీసుకువచ్చింది. సామాన్యుల నుంచి వేల రూపాయలను బెనిఫిట్ షో రూపంలో వసూలు చేస్తున్నారని... నిబంధనలు తుంగలో తొక్కుతూ.. ఎక్కువ షోలు వేస్తున్నారని ఆరోపించింది ప్రభుత్వం. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించింది ప్రభుత్వం.

అయితే ఈ బిల్లుతో ప్రస్తుతం టాలీవుడ్ లబోదిబో అంటుంది. తాజా బిల్లు ద్వారా సినిమా టికెట్లను ఇకపై ఆన్ లైన్ ద్వారానే విక్రయించనున్నారు. అది కూడా ప్రభుత్వం నిర్ణయించిన వెబ్ సైట్ల ద్వారా మాత్రమే టికెట్ల లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. ఈ విధానంపై ముందుగా టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలతో చర్చలు జరిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఆన్ లైన్ విధానానికి పరిశ్రమ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే సమయంలో టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతించకపోవడం, ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి నిరాకరించడంపై మాత్రం ఇండస్ట్రీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా... జగన్ సర్కార్ మాత్రం కనికరించలేదు. సామాన్య ప్రేక్షకుల కోసమే తాము నిర్ణయం తీసుకున్నామన్నారు. నో బెనిఫిట్ షో, నో ఎక్స్ ట్రా షో, నో టికెట్ హైక్... అంటూ తేల్చేసింది జగన్ సర్కార్. ఇప్పుడు టికెట్ల కొత్త రేట్లను కూడా ప్రభుత్వం నిర్ణయించేసింది. ప్రభుత్వ రేట్లతో ఇక నిర్మాతలు, థియేటర్ల యజమానులు తీవ్రంగా నష్టోపోవడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. కొత్త ధరల ప్రకారం కనిష్ఠ ధరను 5 రూపాయలుగా, గరిష్ఠ ధరగా 250 రూపాయలుగా నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.


మరింత సమాచారం తెలుసుకోండి: